ప్రజాశక్తి -రాయచోటి రాయచోటికి మణిహారంలా సందర్శకులకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించేలా నగరవనం నిర్మాణాలు అభివద్ది చేయాలని కలెక్టర్ గిరీష, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి పట్టణం ఎగువ అబ్బవరం సమీపంలో 80 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మితమవుతున్న నగరవనానికి అనుసంధానంగా ఎండపల్లి పంచాయతీ ముసలిరెడ్డిగారి పల్లె ఒంటిమాను చెట్టు వద్దనున్న కదిరి రహదారి నుంచి రూ.34 లక్షల డిఎంఎఫ్ నిధులుతో చేపట్టి పూర్తయిన రహదారిని వారు ప్రారంభించారు. అనంతరం నగరవనం పనులను అధికారులలో కలసి పరిశీలించారు. నగరవనం నిర్మితమవుతున్న ప్రాంతాలను కలియ తిరిగారు. ఇందులో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్, చిల్డ్రెన్స్ పార్క్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, కమ్యూనిటీ హాల్, కేఫ్, బాత్ రూమ్స్, వాచ్ టవర్, కంచాలమ్మ గండిలో ఏర్పాటు చేయనున్న బోటింగ్ తదితర అంశాలపై అటవీశాఖాధికార్లతో చర్చించారు. కొండ ఎక్కడానికి, దిగడానికి తయారు చేసిన (ట్రెక్కింగ్) రహదారులును పరిశీలించారు. కొండపైన 15 అడుగుల పగోడా ను ఏర్పాటు చేయాలని, వాకింగ్ ట్రాక్ చుట్టూ సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సంప్ ఏర్పాటు చేసుకుంటే వెలిగల్లు నీటిని అందిస్తామన్నారు. ఆర్‌ఒ ప్లాంట్ పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సోషల్ ఫారెస్ట్ డిఎఫ్‌ఒ నాగమల్లేశ్వరి, రేంజ్ అధికారి రఘు శంకర్‌ను వారు ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మున్సిపల్ కమిషనర్ గంగ ప్రసాద్, స్టేట్ సివిల్ సప్లయిస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, వైస్ ఎంపిపి జయపాల్ రెడ్డి, ఫారెస్ట్, పంచాయతీరాజ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.