ఆరోగ్యశ్రీపై ఇంటింటికీ అవగాహన

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఆరోగ్యశ్రీపై ఇంటింటికీ వెళ్లి ఎఎన్‌ఎంలు, సిహెచ్‌ఒలు ప్రజలకు వివరిస్తారని, నెలరోజులపాటు పెద్దఎత్తున సాగే ఈ కార్యక్రమం శుక్రవారం నుండి ప్రారంభమైందని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మువ్వా తిరుమల కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు బ్రోచర్‌ను గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లోని శుశృత హాల్లో ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఈ అవగాహనా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను ఎలా డౌన్లోడ్‌ చేసుకోవాలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరిస్తారని, దగ్గర్లో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వివరాలను అందిస్తారని తెలిపారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి వెళ్లగానే ఎవరిని కలవాలి? ఏయే సేవలు అందుబాటులో ఉంటాయి? వంటి సమాచారాన్ని బ్రోచర్లలో పొందుపరచినట్లు చెప్పారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సమస్యలేమైనా ఎదురైతే ఎవరికి ఫిర్యాదు చెయ్యాలో బ్రోచర్లలో ఉంటుందన్నారు. అనంతరం జిజిహెచ్‌లోని జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఇదిలా ఉండగా ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా ఎయిడ్స్‌ బాధితులతో కృష్ణబాబు మాట్లాడారు. ఎటిఆర్‌ సెంటర్‌ గురించి వివరాలు అడిగారు. ఆయనవెంట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ఉన్నారు.

➡️