ప్రజాశక్తి-అమలాపురంఆడుదాం ఆంధ్ర పోస్టర్, మస్కట్ను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఆవిష్కరించారు. గోదావరి భవన్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారని.. ఆసక్తి ఉన్న క్రీడాకారులు డిసెంబర్ 13 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో లేదా 1902కి కాల్ చేయడం ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చనన్నారు. ఐదు క్రీడాంశాలలో గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాట్మెంటన్ డబుల్స్, ఖోఖో, కబడ్డీ పోటీలు జరుగుతాయన్నారు. పోటీలో విజేతలకు సర్టిఫికెట్లు ట్రోఫీలు పతకాలు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గం జిల్లా రాష్ట్రస్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజరు, డిఆర్ఒ సిహెచ్ సత్తిబాబు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు సురేష్ పాల్గొన్నారు.