ప్రజాశక్తి – కాకినాడ
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌కు సంబంధించిన కిట్లను సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కిట్లను పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టర్ క్రీడాకారుల కిట్లను పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 15 ఏళ్లు పైబడిన అన్ని వయస్సుల వారిని క్రీడల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం, ఆనందాన్ని సొంతం చేసుకోవడం, క్రీడా సంస్కృతిని విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం అడుగు లేస్తోందన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్యం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు. పురుషులు, మహిళల కోసం 5 విభాగాల్లో వేర్వేరుగా క్రీడా పోటీలు నిర్వహిస్తోందన్నాను. బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్‌తోపాటు, అన్ని స్థాయిల్లో మూడు అదనపు గేమ్‌లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మారథాన్, యోగా, టెన్నికాయిట్ ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ సాంప్రదాయ ఆటలను సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిం చడం జరుగుతోందన్నారు. క్రీడాకారులు సంబం ధిత గ్రామ, వార్డు సచివాలయాల నివాసంగా ఉండాలన్నారు. అలాగే వారి ఆధార్ కార్డ్ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుతో పోటీలకు నమోదు చేసుకోవచ్చ న్నారు. ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని, ఈ పోటీలను 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకూ జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్డ్ పోస్టర్‌ను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డిఆర్‌ఒ కె.శ్రీధర్ రెడ్డి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.శ్రీనివాస కుమార్, జడ్‌పి సిఇఒ వెంకటరమణారెడ్డి, డిఎం అండ్ హెచ్‌ఒ జె.నరసింహ నాయక్, డిఇఒ నాగమణి, డిఎల్‌డిఒ పి.నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.