‘ఆడుదాం ఆంధ్ర’ను విజయవంతం చేయాలి

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా; జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశం హాలులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని డిసెంబరు 15వ తేదీ నుండి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామ, వార్డు స్థాయిలో 5 రోజుల పాటు, మండల స్థాయిలో 12 రోజుల పాటు, నియోజకవర్గ స్థాయిలో 5 రోజుల పాటు, జిల్లా స్థాయిలో 7 రోజుల పాటు, రాష్ట్ర స్థాయిలో 5 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంద న్నారు. జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జనవరి 26వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 5 రకాలు క్రికెట్‌, బాల్‌ బాట్మెంట్‌, వాలీబాల్‌, కబడ్డి ఆటలు నిర్వహించాలన్నారు. క్రీడలు నిర్వహించడానికి అవసరమైన గ్రౌండ్స్‌ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. క్రీడాకారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన చెప్పారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో 15 సంవత్సరాలు నిండిన వారు క్రీడల్లో పాల్గొనవచ్చన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌, అదనపు జిల్లా ఎస్‌.పి మహేష్‌, డి.ఆర్‌.డి ఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అర్జున్‌రావు, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, పౌర సరఫరాల శాఖ డి.ఎస్‌.ఓ విలియమ్స్‌, డి.ఎం శ్రీలక్ష్మి, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

➡️