ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అసైన్డు భూముల క్రమబద్ధీకరణకు ఉద్ధేశించిన పరిశీలన ఇంత వరకు కొలిక్కి రాలేదు. ఆగస్టు నుంచి ఈ పరిశీలన జరుగుతున్నా ఇంకా పూర్తి కాలేదు. అసైన్డు భూముల సాగులో పలు అక్రమాలు చోటుచేసుకు ంటున్నాయి. పలు ప్రాంతాల్లో పేదలు సాగు చేసుకుంటున్న భూములను రెవెన్యూ అధికారుల సహకారం, రాజకీయ ప్రము ఖులు అండదొండలతో ఇతరులు తమ అధీనంలోకి తీసుకున్నారు. కొన్ని దశాబ్ధాలుగా పేదలకు ఆయా ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములు చాలా వరకు వారి అధీనంలో లేవు. గుంటూరు జిల్లాలో 6518 ఎకరాలు పంపిణీ చేయగా కేవలం 648 మంది ఎకరాలు మాత్రమే వాస్తవ లబ్ధిదారుల చేతుల్లో ఉన్నాయి. పల్నాడు జిల్లాలో 35,875 ఎకరాలు పంపిణీ చేయగా కేవలం 8,310 ఎకరాలే లబ్ధిదారుల చేతుల్లో ఉన్నట్టు గుర్తించారు. మిగతా వాటికి వాస్తవ లబ్ధిదారులు కాకుండా ఇతరుల చేతుల్లో ఉన్నాయి. ప్రధానంగా పల్నాడు జిల్లాలోని వినుకొండ, మాచర్ల, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున చేతులు మారాయి. రికార్డుల్లో అనుభవదారుల పేర్లుకూడా గల్లంతయ్యాయి. పేదల భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లినా వీటిపై ఎటువంటి చర్యలూ లేవు. అసైన్డు భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయనే అంశంలో రెవెన్యూ అధికారులు కొంతకాలంగా చేపట్టిన సర్వే కొలిక్కి రాలేదు. చాలా భూములను రెవెన్యూ అధికారుల ద్వారా సంబంధిత అక్రమార్కులు ఆన్‌లైన్‌లో మార్పులు చేయించుకున్నారు. గుర్తించిన భూములకు తప్ప మిగతా వాటికి సంబంధించిన భూ రికార్డుల్లో అనుభవదారుల పేర్లు కూడా సరిగా లేవు. కొన్ని భూములు చెరువులు, కుంటల పరిధిలో ఉన్నా రాజకీయ అండదండలతో ఆయా ప్రాంతాల్లోని భూ స్వాములు సాగు చేసుకుంటున్నారు. అసైన్డు భూములు పొంది 20 ఏళ్లు దాటిన వారికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. గుంటూరు జిల్లాలో 6518 ఎకరాలకు గాను 648 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 35,875 ఎకరాలకు గాను 8,310 ఎకరాలకు గాను మొత్తంగా 9 వేల మంది అర్హులు ఉన్నట్టు తెలిసింది. ఈ భూములకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం, 1బి రిజిస్టర్, అడంగల్, వెబ్ ల్యాండ్‌లో వాస్తవ లబ్ధిదారుని వివరాలు ఉన్నాయా అనే విషయంపై పరిశీలన జరుగుతోంది. వాస్తవ లబ్ధిదారులు జీవించిలేకపోతే వారి వారసులు అనుభవదారులుగా ఉన్నారా? లేదా? అనే గుర్తించే ప్రక్రియ పూర్తి కాలేదు. అర్హులైన వారసులురటే అందుకు సంబంధించి డాక్యుమెంట్లతో సహా వివరాలను జిల్లా స్థాయి కమిటికి పంపాలి. జిల్లాస్థాయి కమిటీ ఆమోదం తరువాత సంబంధిత అనుభవదారులు, లేక వారసులకు హక్కు పత్రాలు ఇవ్వనున్నారు. అయితే వాస్తవ లబ్ధిదారులు లేకపోతే ఎవరు అనుభవంలో భూమి ఉందో వారి వద్ద కొంత ఫీజు తీసుకుని హక్కుపత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవ లబ్ధిదారుల నుంచి భూములు కొనుగోలు చేసిన వారు బిపిఎల్ పరిధిలో ఉన్నవారైతే రిజిస్ట్రేషన్ విలువ చెల్లిస్తే వారికి హక్కుపత్రాలు అందిస్తారు. బిపిఎల్ పరిధిలో లేని వారైతే పట్టా రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ సంబంధిత వ్యక్తి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువలకు రెండున్నర రెట్లు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామంటున్నారు. వీటిపై ఇంకా స్పష్టమైన ఉత్తర్వులు రావాల్సి ఉంది.