అరెస్టు అప్రజాస్వామికం : డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి -కడప అర్బన్‌ జగనన్న దర్గా దర్శనానికి వచ్చిన అరెస్టేనా అని ప్రశ్నించే గొంతుకలను ఉక్కు పాదం మోపడం అప్రజాస్వామికం అని నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు అన్నారు. ముఖ్యమంత్రి పెద్ద దర్గా సందర్శన సందర్భంగా తాలూకా పోలీసులు ఓబులేసును గురువారం ఉదయం అరెస్టు చేసి సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి కడప జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇంటి దగ్గరికి వచ్చి అరెస్ట్‌ చేశారని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల సందర్బంగా నిరుద్యోగ యువతకు ప్రతి ఏటా మెగా డీఎస్సీ, జాబ్‌ కాలెండర్‌, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తాను అని నమ్మబలికి అధికారం లోకి వచ్చిన నాలుగున్నర సంవత్సారాలు పూర్తి అయిన ఒక్క నోటిఫికేషన్‌ విడుదల చేశారా అని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్యలపై నిరంతరమూ పోరాటాలు చేస్తామని, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పేర్కొన్నారు. నాయకులకు నోటీసులు.. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా ఉపాధ్యాయ, వివిధ పార్టీల నాయకులకు పోలీసులు నోటీసులు అందజేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌కు జమ్మలమడుగులో నోటీసులు అందించారు. ఎపిటిఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్‌ సుందరరెడ్డికి, మరికొందరికి ఇచ్చారు.

➡️