అమీర్‌ పీర్‌ దర్గా ఉరుసు జిల్లా పండుగ -ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా

ప్రజాశక్తి – కడప అర్బన్‌ అమీర్‌పీర్‌ దర్గా ఉరుసు ఉత్సవాలకు యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.బి అంజద్‌ బాషా అన్నారు. శనివారం స్థానిక నకాష్‌ ప్రాంతంలోని అమీర్‌ పీర్‌ దర్గాలో ఉరుసు ఉత్సవాల సూచికంగా బెలూన్‌ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్‌ పీర్‌ దర్గా ఉరుసును జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉరుసు ఉత్సవాలకు రాష్ట్ర ప్రజలే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలే ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రభుత్వ పరంగా కలెక్టర్‌ వారికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఉరుసుకు సంబంధించి ఒక బందాన్ని మహోత్సవాలకు విజయవంతం కావడానికి నియమించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆదివారం నుంచి గంధ మహోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అందుకు శుభసూచికంగా బెలూన్‌ను ఎగురవేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక చాదర్‌ను కూడా సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అప్జల్‌ ఖాన్‌, కార్పొరేటర్లు షేక్‌. మహమ్మద్‌ షఫీ, అక్బర్‌, నాయకులు జఫ్రూళ్ల, కరముల, జైద్‌, దర్గా మేనేజర్‌ మహమ్మద్‌ ఖాన్‌, సహదారుడు కుతుబద్దీన్‌, ముజావార్‌ అమీర్‌ బాషా, మాట పెద్దలు, దర్గా సిబ్బంది పాల్గొన్నారు.

➡️