అనుకున్నదొకటి..!

Nov 26,2023 23:08
మొత్తం మీద

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి

‘అనుకున్నది ఒకటి..అయ్యింది’ ఒకటి అన్నట్లుగా ఉంది స్థానిక సంస్థల ప్రతినిధుల పరిస్థితి. వైసిపి పాలనలో జిల్లాకు చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. పంచాయతీల్లో పారిశుధ్య పనులు లేవు. చిన్న సమస్య పరిష్కారానికైనా నిధుల కొరత వెంటాడుతోంది. ఉపాధి హామీ సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. కొన్నిసార్లు నెలలు తరబడి పెండింగ్‌లో బిల్లులు ఉండిపోతున్నాయి. సచివాలయ వ్యవస్థ ప్రారంభించి రెండేళ్లు అవుతున్నా సేవలు మెరుగుపడ లేదు. ప్రతివారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి అర్జీల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. పంచాయితీలకు సమాంతర వ్యవస్థగా మారుతున్న సచివాలయ వ్యవస్థ పటిష్టానికి నిర్మిస్తున్న కొత్త భవనాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుభరోసా కేంద్రాలు ఆశించిన స్థాయిలో ఫలితమివ్వలేదు. రైతులు ఎప్పటిలానే ప్రారంభంలో యూరియాకు, దిగుబడిల అనంతరం విక్రయాలకు అవస్థలు పడుతూనే ఉన్నారు. ప్రజా ప్రతినిధులు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న జగనన్న కాలనీలో లబ్ధిదారులు సైతం పెదవిరుస్తున్నారు. ఇలా అన్నింటా ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి.అంతర్మథనంలో ద్వితీయశ్రేణి నాయకులు మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణుల్లో సైతం అంతర్మథనం ప్రారంభమైంది. పార్టీ కోసం శ్రమిస్తే అందుకు తగ్గట్టు ప్రతిఫలం లేదని నిట్టూరుస్తున్నారు. కొద్దిమందికి నామినేటెడ్‌ పదవులు దక్కినా వాటితో వారు కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఎటువంటి విధులు, నిధులు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన అప్పులే మిగిలాయని సర్పంచ్‌లు పెదవి విరుస్తున్నారు. కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధులు సైతం మళ్లిస్తుండడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఎంఎల్‌ఎలను మినహాయిస్తే..మండల, గ్రామ స్థాయిలో పార్టీ గెలుపునకు కష్టించి పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు గందరగోళంలో పడింది. పేరుకే అధికార పార్టీ కానీ..తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతలకు నామినేటెడ్‌ పద్ధతిపై ఇచ్చే పనులు ఎక్కడా కనిపించడం లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు మ్యాచింగ్‌ చేసి పనులు కూడా చేయడం లేదు. కేవలం సంక్షేమ పథకాలపైనే ప్రభుత్వం దృష్టిపెడితే తమ పరిస్థితి ఏమిటని వారు పెదవి విరుస్తున్నారు.పనులు చేసేందుకు వెనుకడుగు పంచాయతీల్లో ప్రభుత్వ పరంగా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. పంచాయతీల అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌కు చేరడమే ఈ దుస్థితికి కారణం. కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధులు సైతం ప్రభుత్వం దారిమల్లిస్తోంది. విద్యుత్‌ ఛార్జీలకు జమ చేస్తుంది. దీంతో పాలకవర్గాలు చిన్నపాటి అభివృద్ధి పనులు సైతం చేయించలేని దుస్థితి నెలకొంది ఒక వేళ చేసినా బిల్లులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదు. అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్‌ క్లీనిక్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటి పనులు చేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు బిల్లులు రాక అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు. ఎప్పుడు బిల్లులు వస్తాయోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు ఆదాయాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంఎల్‌ఎలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల దృష్టిలో పడేందుకు పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం నవరత్నాల పేరిట సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందని, తమ క్యాడర్‌కు మాత్రం ఏదీ దక్కలేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.నిధులు లేని పదవులు రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్లకు సంబంధించి జిల్లాకు పదవులు దక్కాయి. ఛైర్మన్లతోపాటు డైరెక్టర్‌ పదవులు పదుల సంఖ్యలో దక్కించుకున్న నాయకులు నిధులు లేక నిట్టూరుస్తున్నారు. గతంలో వివిధ కులాల కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించేవారు. ఆ కార్పొరేషన్లు ప్రత్యేకంగా ఆ వర్గాలకు చెందిన వారికోసం కార్యక్రమాలు అమలు చేసేవి. ఫలితంగా కొంత మేలు జరిగేది. వైసిపి అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా తలకిందులు అయ్యాయి. కార్పొరేషన్లను వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మాత్రమే మార్చేశారు. కొంతమందికి కార్యాలయాలు కూడా కేటాయించిన పరిస్థితి నెలకొంది. ఇక కార్యకలాపాల సంగతి సరేసరే. మొత్తం మీద క్రమక్రమంగా అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

➡️