అధికార పార్టీలో లుకలుకలు

వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న వ్యతిరేక వర్గం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

కాకినాడ జిల్లాలో పొలిటికల్‌ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీలో ముఖ్య నేతలపై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇటీవల ఒక్కసారిగా వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతల తీరుపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్‌ అంటే ఇష్టమే కానీ స్థానిక నేతల వలన ఇమడలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయి నాయకులకు, పార్టీ పెద్దలకు వారికున్న ఇబ్బందులు వెల్లడించినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో చివరకు రాజీనామాలకు సైతం సిద్ధపడుతున్నారు. ఈ పరిణామాలు అధికార పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి.ప్రత్తిపాడులో అసమ్మతి సెగ ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొంతకాలంగా వర్గ విబేధాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఎంఎల్‌ఎ పర్వత ప్రసాద్‌, అదే పార్టీకి చెందిన మాజీ ఎంఎల్‌ఎ వరుపుల సుబ్బారావు మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. కొంతకాలంగా రెండు వర్గాల నేతలు బాహాటంగానే సవాళ్లు, ప్రతి సవాళ్ళకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు ఎంపిపిలతో సహా మరో నలుగురు వైసిపిీకి రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు.ఏలేశ్వరం ఎంపిపి గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి), రౌతులపూడి గంటిమళ్ళ రాజ్యలక్ష్మి, తూర్పు లక్ష్మీపురం సర్పంచ్‌ డాక్టర్‌ వీరంరెడ్డి సత్య నాగ భార్గవి, భద్రవరం ఎంపిడిసి సభ్యుడు కొప్పుల బాబ్జీలు ఒకే సారి రాజీనామాలు చేశారు. నాలుగేళ్లుగా ఎంఎల్‌ఎ నుంచి ఎన్నో అవమానాలు, వేధింపులకు గురవుతున్నామన్నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రీజనల్‌ కోఆర్డినేటర్‌ మిథున్‌ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు చెప్పినా ఫలితం లేక చివరకు పార్టీకిరాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనిపై ఎంఎల్‌ఎ పర్వత వర్గీయులు సోషల్‌ మీడియా వేదికగా పదవులకు కూడా రాజీనామాలు చేస్తే మీ బండారం బయట పడుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దాడిశెట్టి, ద్వారంపూడి మధ్య కుదరని సఖ్యత కాకినాడ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజాకి జిల్లాలో కీలక నేతగా ఉన్న కాకినాడ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇద్దరి నేతలూ పెత్తనం కోసం పోటీపడి దాదాపు ప్రత్యర్థులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం గట్టిగానే వినిపిస్తోంది. మాజీ మంత్రి కన్నబాబు, ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత ప్రసాదు వంటి వారికి కూడా ద్వారంపూడితో సానుకూల సంబంధాలు లేవని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మంత్రి రాజా, ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత మధ్య కూడా సఖ్యత లేదు. ఇటీవల అన్నవరం ఇఒ ఆజాద్‌ బదిలీ కోసం ఎంఎల్‌ఎ గట్టిగా ప్రయత్నాలు చేయగా మంత్రి అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఇఒ బదిలీపై వెళ్లారు. జగ్గంపేటలో కొనసాగుతున్న జగడం జగ్గంపేటలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు, మాజీ మంత్రి తోట నరసింహం మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. నరసింహం తన కుమారుడు రాంజీతో కలిసి కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ పరోక్షంగా ఎంఎల్‌ఎపై విరుచు పడుతున్నారు. తామే పోటీలో ఉంటామని చెప్పుకొస్తున్నారు. వీరి మధ్య విభేదాలు అధినాయకత్వం పరిష్కారం చేయ లేకపోతోంది.ఎంఎల్‌ఎ వర్సెస్‌ ఎంపీ పిఠాపురం ఎంఎల్‌ఎ పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ మళ్లీ తనదే అని దొరబాబు ఇప్పటికే ప్రచారం చేసుకుంటుండగా ఎంపీ పరోక్షంగా తన అనుచరులతో పిఠాపురంలో మరోసారి పోటీకి దిగుతున్నారనే సంకేతాలు ఇస్తున్నారు. పదేళ్లపాటు కష్ట కాలంలో వున్నప్పుడు కూడా పార్టీని అంటుపెట్టుకుని నియోజకవర్గ ప్రజల వెన్నంటే ఉన్న తనను కాదని అధిష్టానం టిక్కెట్‌ మరొకరికి ఇచ్చే ఛాన్స్‌ లేదని పెండెం కుండ బద్దలు కొడుతున్నారు. దవులూరికి అసమ్మతి సెగపెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దవులూరు దొరబాబుకి అసమ్మతి సెగ తప్పడం లేదు. పెద్దాపురం చెందిన సీనియర్‌ నాయకుడు గోలి రామారావు, సామర్లకోటకు చెందిన మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ గోలి వెంకట అప్పారావు చౌదరి తదితరులు అసమ్మతి వర్గంగా విడిపోయి పలుమార్లు దొరబాబుపై అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అసమ్మతి వర్గానికి చెందిన గోలి రామారావు అచ్చంపేట సర్పంచ్‌ వీరం రెడ్డి చినబాబు తదితరులు వైసిపి టిక్కెెట్‌ అడుగుతారనే ఉద్దేశంతో వ్యూహా త్మకంగా దొరబాబు వారిని దూరం పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన సభలో సిఎం జగన్‌ దవులూరికి టిక్కెట్‌ కన్ఫార్మ్‌ చేయడంతో వ్యతిరేక వర్గం అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. మాజీ మంత్రికి తప్పని వర్గ పోరుకాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు వర్గ పోరు తప్పడం లేదు. అదే పార్టీకి చెందిన పితాని అన్నవరం వచ్చే ఎన్నికల్లో వైసిపి నుంచి టిక్కెట్‌ వచ్చినా, రాకపోయినా ఎంఎల్‌ఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్నిచోట్ల ప్రచార బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. తాను టికెట్‌ ఆశిస్తున్నా అధిష్టానం పట్టించుకోవడం లేదన్నట్లుగా అన్నవరం చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన రెబల్‌ అభ్యర్థిగా పోటీలోకి దిగితే అధికార పార్టీలో ఓట్ల చీలిక తప్పేలా లేదు.

 

➡️