ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో జలసిరి అడుగంటిపోతోంది. జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్, తెలుగుగంగ, తుంగభద్ర ప్రాజెక్టుల పరిధిలో 11 సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. విభజిత జిల్లాల నేపథ్యంలో కడప జిల్లాలో 84 టిఎంసిలు నిల్వల్లో 33 టిఎంసిలకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ వరకు ఆశించిన వర్షపాతం నమోదవని నేపథ్యంలో డెడ్ స్టోరేజీ దిశగా పరుగులు తీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గండికోట, బ్రహ్మసాగర్, మైలవరం మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ తాగునీటి అవసరాలు తీర్చడానికి పరిమితమయ్యాయి. జిల్లాలోని ప్రాజెక్టులను సాగునీటి అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా కృష్ణా జలాలు ఆవసరం మేర అందని నేపథ్యంలో తాగునీటి అవసరాలకు పరిమితమయ్యాయి. ప్రస్తుత తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేసవిలో తాగునీటికి ఎద్దడి నెలకొనే అవకాశం ఉందనిపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాశక్తి – కడప ప్రతినిధి ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల్ని పూర్తి చేస్తే సుమారు 22 లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది. జిల్లాలో కెసి కెనాల్ ప్రధాన సాగు నీటి వనరుగా నిలిచింది. రూ.వేలాది కోట్లతో నిర్మితమవుతున్న రిజర్వాయర్లు, ప్రాజెక్టులు ఆశించిన ప్రయోజనాలను నెరవేర్చడం లేదు. జిల్లాలోని 11 సాగునీటి ప్రాజెక్టుల్లో గండికోట, పైడిపాలెం, చిత్రావతి మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ డెడ్‌స్టోరేజీ దిశగా పరుగులు తీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గండికోట, బ్రహ్మంసాగర్, మైలవరం, పైడిపాలెం, సర్వరాయసాగర్, ఎస్ఆర్-1, ఎస్ఆర్-2, అన్నమయ్య, వెలిగల్లు, చిత్రావతి, లోయర్సగిలేరు, ఎగువ సగిలేరు, బుగ్గవంక ప్రాజెక్టులను నిర్మించారు. కృష్ణాజలాలతోనే సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవాల్సి ఉంది. ఈ ఏడాది శ్రీశైలం రిజర్వాయర్‌కు నామమాత్రంగానైనా వరద ప్రవాహం లేకపోవడంతో కృష్ణాజలాలు ప్రశ్నార్థకంగా మారడం తెలిసిందే.గండికోట ప్రాజెక్టు : 26.850 టిఎంసిల సామర్థ్యం కలిగి ఉంది.13.857 టిఎంసిలు మాత్రమే నీరు నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి సుమారు 106 కిలోమీటర్ల మేరకు గాలేరు-నగరి-1 దశలోని పనులు పూర్తి చేయాల్సి ఉంది. పనుల్ని పూర్తి చేయకపోవడంతో కృష్ణాజలాలు అందని మానిపండు చందంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. మైలవరం రిజర్వాయర్ : 9.960 టిఎంసిల సామర్థ్యంతో నిర్మితమైంది. 2.223 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. సాగు నీటి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేశారు. సప్లరు కెనాల్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ : 10 టిఎంసిల సామర్థ్యంతో నిర్మితమైంది. 5.225 టిఎంసిలను కలిగి ఉంది. ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ దిశగా పయనిస్తోంది. వేసవి నాటికి తాగునీటి సరఫరాను సైతం అందించలేని దుస్థితికి చేరుకోనుంది.బ్రహ్మసాగర్ : 17.73 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మితమైంది. 4.158 టిఎంసిల నిల్వను కలిగి ఉంది. ఆర్‌టిపిపికి ఇవ్వాల్సిన 1.5 టిఎంసిలను మినహాయిస్తే తాగునీటి అవసరాలకు పరిమితం కానుందనే వాదన వినిపిస్తోంది. 1.75 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పైడిపాలెం రిజర్వాయర్ : ఆరు టిఎంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మితమైంది. 5.120 టిఎంసిలను కలిగి ఉండడం ఊరట కలిగిస్తోంది. సప్లరుఛానళ్లు లేకపోవడంతో నిండు కుండను పోలి ఉంటుంది.సర్వరాయసాగర్ రిజర్వాయర్ : 3.060 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో చేపట్టారు. 0.740 టిఎంసిలను కలిగి ఉంది. వామికొండ సాగర్ : సర్వరాయసాగర్తో అనుసంధానించబడి ఉంది. 1.658 టిఎంసిల సామర్థ్యంతో నిర్మితమైంది. 1.371 టిఎంసిల నిల్వ ఉంది. సబ్సిడరీ రిజర్వాయర్-1: తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎస్ఆర్-1 2.135 టిఎంసీల సామర్థ్యంతో నీటి నిల్వను కలిగి ఉంది. 0.297 టిఎంసిల నిల్వ నీటిని కలిగి ఉంది. తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమిత మవుతోంది.సబ్సిడరీ రిజర్వాయర్-2 : తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎస్ఆర్-2 2.447 టిఎంసిల నీటి నిల్వను కలిగి ఉంది.0.699 టిఎంసిల నీటి నిల్వలను కలిగి ఉంది. వెలిగల్లు ప్రాజెక్టు : 4.64 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది.3.154 టిఎంసిల నీటి నిల్వను కలిగి ఉంది. 24 వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. వెలిగల్లు ప్రాజెక్టు రాయచోటి పట్టణవాసుల తాగునీటి సమస్యను తీరుస్తోంది.బుగ్గవంక ప్రాజెక్టు : 0.506 టిఎంసిల నిల్వ సామర్య్థాన్ని కలిగి ఉంది. 0.049 టిఎంసిల నీటి నిల్వను కలిగి ఉంది. తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది.అన్నమయ్య ప్రాజెక్టు : 4 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2021 కురిసిన భారీ వర్షపాతానికి ఆనవాళ్లు లేకుండా తెగిపోయింది. లోయర్ సగిలేరు : 0.170 టిఎంసిల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మితమైంది. ప్రాజెక్టులో 0.030 టిఎంసిలను కలిగి ఉంది. 13 వేల ఎకరాల ఆయకట్టు సాగయ్యే అవకాశం ఉంది. ఎగువ సగిలేరు ప్రాజెక్టు : పోరుమామిళ్ల చెరువు నీటి మళ్లింపునకు ఉద్దేశించి ఆనకట్టు తర హాలో నిర్మించారు.