అచ్చొచ్చిన మైదానంలో అదరహో..

ప్రజాశక్తి – పిఎం.పాలెం : అచ్చొచ్చిన మైదానంలో భారత్‌ అదరగొట్టింది. బ్యాట్స్‌మెన్లు సత్తా చాటడంతో 209 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల ఆధిక్యంతో భారత్‌ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఆటలో గెలుపుతో ఈ టి-20 సిరీస్‌లో భారత్‌ బోణీ కొట్టింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తరువాత మ్యాచ్ల్లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు.విశాఖలో సందడిభారత్‌ – ఆసీస్‌ జట్ల మధ్య గురువారం పిఎం.పాలెం ఎసిఎ – విడిసిఎ క్రికెట్‌ స్టేడియంలో టి – 20 మ్యాచ్‌ నేపథ్యంలో సందడి నెలకొంది స్టేడియం క్రికెట్‌ అభిమానులతో మంగళవారం మధ్యాహ్నంనుంచే కిక్కిరిసిపోయింది. ఇండియా గెలవాలంటూ అభిమానులు ప్లకార్డులు, భారత్‌ జెండాలు ప్రదర్శించారు. భారత్‌ టీషర్టులు ధరించి స్టేడియం వద్ద కేరింతలు కొట్టారు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌కు అభిమానులు మధ్యాహ్నం నుంచే ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చేశారు. రుషికొండలోని హోటల్‌ నుంచి స్టేడియంలోకి వచ్చిన క్రికెటర్ల వాహనాలకు ఘన స్వాగతం పలికారు. మ్యాచ్‌ ఏడు గంటలకు ప్రారంభమైనప్పటికీ క్రీడాభిమానులు టికెట్లు చేతపట్టుకుని స్టేడియం చుట్టూ 8:30 గంటల వరకు ప్రదర్శనలు చేశారు. మ్యాచ్‌ మొదలై మొదటి ఇన్నింగ్స్‌ పూర్తయినప్పటికీ స్టేడియం చుట్టూ భారీ సంఖ్యలోనే జనం గుమిగూడి కనిపించారు. సామాన్యులకు అందని తక్కువ ధర టికెట్లన్నీ స్టేడియం చుట్టుపక్కల అధిక సంఖ్యలో ఎక్కువ ధరలకు బ్లాక్‌లో అమ్ముడుబోయాయి. ఈ మ్యాచ్‌ను చూసేందుకు విశాఖతో పాటు శ్రీకాకుళం, ఒడిశా, జార్ఖండ్‌ నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు తరలివచ్చారు.రాణించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు…. మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. ఏడు గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాటింగ్‌లో చెలరేగిపోయారు. 20 ఓవర్లకుగానూ 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేశారు. ఓపెనర్లు స్టీవెన్‌ స్మిత్‌ 41 బంతుల్లో 52 పరుగులతో అర్ధ సెంచరీ చేశాడు. 3వ స్థానంలో దిగిన జోష్‌ ఇంగ్లిష్‌ 50 బంతులలో 11 ఫోర్లు 8 సిక్సులతో 110 పరుగులతో చెలరేగిపోయాడు. 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసి భారత్‌ జట్టు ముందు భారీ టార్గెట్‌ను ఉంచారు. సత్తా చాటిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ బరిలోకి దిగిన భారత ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్లు అంతగా రాణించలేకపోయినప్పటికీ మిడిల్‌ ఆర్డర్లో దిగిన ఇషాన్‌ కిషన్‌ 39 బంతులలో రెండు ఫోర్లు, ఐదు సిక్సులతో 58 పరుగులు, కెప్టెన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ 42 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 80 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరూ అద్భుతమైన ఆటతీరుతో పరుగులు వర్షం కురిపించారు. వీరిద్దరి పార్టనర్‌ షిప్‌లో దాదాపు 138 పరుగులు చేయడంతో భారత్‌ జట్టుకు గెలుపుపై ఆశలు చిగురించాయి. మైదానం మొత్తం క్రికెట్‌ అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తూ భారత క్రికెటర్లకు ప్రోత్సాహం అందించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడంతో స్టేడియంలోని క్రికెట్‌ అభిమానులు కేరింటలు కొట్టారు.

➡️