ప్రజా సమస్యలపై ప్రశ్నించే కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపండి : మాణిక్‌ సర్కార్‌

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తున్నాయి
  • ఖమ్మం, మధిర రోడ్‌ షోల్లో త్రిపుర మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ఈ ఎన్నికలు తెలంగాణకే కాదు దేశానికి అతి ముఖ్యమైనవని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ అన్నారు. దేశాన్ని విభజించి పాలించే రీతిలో బిజెపి వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపాలని కోరారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ల తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం బాగా పెరిగాయని తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి యర్రా శ్రీకాంత్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం పట్టణంలోనూ, మధిర అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ విజయాన్ని కాంక్షిస్తూ మధిర పట్టణంలోనూ శుక్రవారం నిర్వహించిన రోడ్‌ షోల్లోనూ, బహిరంగ సభల్లోనూ మాణిక్‌ సర్కార్‌ పాల్గొని ప్రసంగించారు. దేశంలో వ్యవసాయదారులు, కూలీలు, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన బిజెపిని ఓడించాలనే నినాదంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 19 స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారిని గెలిపించి అసెంబ్లీకి పంపితే ప్రజాస్వామ్య హక్కులపై ప్రశ్నిస్తారని, ప్రజల తరుఫున పోరాడుతారని అన్నారు. 50 ఏళ్లలో కంటే బిజెపి తొమ్మిదిన్నరేళ్ల పాలనలోనే నిరుద్యోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దేశాన్ని విభజించి పాలించాలనే ఉద్దేశంతో కుల, మత విద్వేషాలను బిజెపి ప్రభుత్వం రెచ్చగొడుతోందని విమర్శించారు. ప్రజా మిగతా 5లో పోరాటాలను అణచి వేయాలని చూస్తోందని, పౌర హక్కులను కాలరాస్తోందని, రాజ్యాంగంపైనా దాడి చేస్తోందని, మీడియానూ స్వేచ్ఛాయుతంగా పనిచేసుకోనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపికి బిఆర్‌ఎస్‌ పాలన కూడా ఏ మాత్రమూ మినహాయింపు కాదన్నారు. రాష్ట్రంలోనూ నిరుద్యోగం బాగా పెరిగిందని, షెడ్యూల్‌ కులాలకు ఇచ్చిన హామీల అమలులో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యమైందని విమర్శించారు. ప్రయివేటు, కార్పొరేట్ల చేతుల్లోకి విద్య, వైద్య రంగాలు వెళ్లిపోయాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న యర్రా శ్రీకాంత్‌ను, పాలడుగు భాస్కర్‌ను గెలిపించాల్సిందిగా కోరారు. ఖమ్మం రోడ్డు షోలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️