ప్రజాశక్తి-కూనవరం
కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా ప్రతి పోలవరం నిర్వాసితుడికీ పూర్తిస్థాయిలో పరిహారం త్వరితగతిన అందాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. సిపిఐ సీనియర్ నాయకులు మండా దుర్గాప్రసాద్ ఇంటి వద్ద వాసం రాము అధ్యక్షతన శుక్రవారం జరిగిన విలీన నాలుగు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులకు కడుతున్న కాలనీల నిర్మాణం నత్తనడకన సాగుతుందని, నాసిరకంగా ఉందని ఆరోపించారు. గిరిజనేతరులకు గోకవరం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరదలు వల్ల ముంపునకు గురైన ఇళ్లకు ఇస్తామన్న రూ.10వేలు తక్షణమే ఇవ్వాలన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం ఇస్తేనే ఆర్ అండ్ ఆర్ సాధ్యమవుతుందని చెప్పిన ముఖ్యమంత్రి, ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రక్రియ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితుల వలన పోలవరం ముంపు మండలాల్లో వరి, మిర్చి పంటలు ప్రధానంగా దెబ్బతిన్నాయని, ఈ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, సీనియర్ నాయకులు మండ దుర్గాప్రసాద్, డివిజన్ కార్యదర్శి గుజ్జా మోహన్‌రావు, నాయకులు కందుకూరి స్వర్ణ, లంబు శ్రీనివాసరావు, జుత్తుక సూర్యచంద్రరావు, గుంటుక కుసుమ రాణి, నాలుగు మండలాల కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.