ప్రజాశక్తి- కె.కోటపాడు
ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, సహాయ కార్యదర్శి రొంగలి ముత్యాలు నాయుడు డిమాండ్ చేశారు. మండలంలోని పోతనవలస, వారాడ, ఆర్‌వై. అగ్రహారం తదితర గ్రామాలలో శుక్రవారం వారు పర్యటించి కోసి తరువాత వర్షానికి తడిసి ముద్దయిన వరి పనలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతుల పరిస్థితి ఇటు చూస్తే నుయ్య అటు చూస్తే గొయ్యి లాగా ఉందన్నారు వరి ఆకులు వేసినప్పటినుంచి ఇప్పటివరకు తీవ్ర వర్షాభావ పరిస్థితి వల్ల అనేక ఇబ్బందులు పడి నీరు సౌకర్యం ఉన్నచోట రైతులు వరి పంటను పండించారని తెలిపారు. ఇప్పుడు పండిన పంటను కోత కోసి పొలంలో ఆరబెట్టగా, అకాల వర్షాల వలన తడిసి ముద్దయ్యాయన్నారు. రాష్ట్రంలో 400 వరకు మండలాలు తీవ్ర కరువు పరిస్థితులతో అల్లాడుతుండగా రాష్ట్ర ప్రభుత్వము కేవలం 103 మండలాలలో కరువు ఉందని వాటిని మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. తడిసిన వరి పొలాలను అధికారులు పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.