ఆవేదనలో అంగన్వాడీలు

ప్రజాశక్తి-చిలకలూరిపేట : ప్రభుత్వ ఉద్యోగి అనే పేరుతో సంక్షేమ పథకాలను దూరం చేస్తూ జీతం ఇచ్చేటప్పుడు మాత్రం అత్తెసరు మొత్తంతో ప్రభుత్వాలు సరిపెడుతున్నాయి. ఇచ్చేదే అరకొర వేతనాలైతే బకాయిలనూ నెలల తరబడి పెండింగ్‌ పెడుతున్న కారణంగా వడ్డీలకు అప్పులు తేవాల్సిన దుస్థితిలో అంగన్వాడీలున్నారు. దీనికితోడు అదనపు పనులనూ రుద్దుతూ తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు.చిలకలూరిపేట నియోజకవర్గంలో 260 మంది అంగన్వాడీ టీచర్లు, అంతే సంఖ్యలో అంగన్వాడీ ఆయాలు(హెల్పర్లు)న్నారు. టీచర్‌కు రూ.11,500, ఆయాలకు రూ.7 వేలు చొప్పున వేతనాలిస్తున్నారు. ఇవి కుటుంబ పోషణకు ఏ మాత్రమూ సరిపోవడం లేదు. తెలంగాణలో కంటే అదనంగా రూ.వెయ్యి ఇస్తామనే హామీని సిఎం విస్మరించారు. మరోవైపు అద్దె భవనాల్లో నిర్వహించే సెంటర్‌ అద్దెలు, కూరగాయలు, గ్యాస్‌, కరెంటు బిల్లులను ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్‌ పెడుతోంది. ప్రభుత్వం చెల్లించే వరకూ ఆ భారాన్ని అంగన్వాడీలే భరించాల్సి వస్తోందని, ఇందుకుగాను వడ్డీలకు అప్పులు తెచ్చి సెంటర్లను నిర్వహిస్తున్నారు.
పని భారం..
ప్రతినెలా 1-5 తేదీల్లో మూడేళ్లలోపు పిల్లలకు ఎత్తు, బరువు కొలిచి వాటిని యాప్‌లో నమోదు చేయాలి. సాధారణ రికార్డుల్లోనూ రాయాల్సి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాలకు రాలేని పిల్లల తల్లులను పిలిపించుకుని పిల్లల కొలతలు తీసుకోవడం, వాటిని రెండుసార్లు నమోదు చేయాల్సి రావడం అంగన్వాడీలకు పని భారంగా మారింది. దీనికితోడు కమ్యూనిటీ బేస్డ్‌ ఈవెంట్స్‌ అంటూ నెలకు రెండుమూడు సార్లు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుండి అంగన్వాడీలకు ఒత్తిళ్లు వస్తున్నాయి. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహనలు తదితర కార్యక్రమాల నిర్వహణకు జన సమీకరణ భారమూ అంగన్వాడీలకు శిరోభారంగా మారింది. ఈ కార్యక్రమ నిర్వహణ కింద ప్రతి అంగన్వాడీకి ఒక్కో కార్యక్రమానికి రూ.250 చొప్పున ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి తమ ఖాతాల్లో జమ కావడం లేదని అంగన్వాడీలంటున్నారు.
దక్కని రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఏళ్ల తరబడి సేవలు చేసిన అంగన్వాడీలు హుందాగా రిటైర్‌ కావడానికి, విశ్రాంత జీవితం గౌరవ ప్రదంగా జీవించడానికి వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం రిటైర్‌ అయిన టీచర్‌కు రూ.50, హెల్పర్‌కు రూ.20 వేలు ఇస్తున్నారు. అయితే వీటిని వెంటనే ఇవ్వకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. కావూరు సెక్టార్‌లో పని చేస్తూ ఏప్రిల్‌లో రిటైర్‌ అయిన పద్మావతి అనే టీచర్‌కు రూ.50 వేలు, గణపవరంలో పని చేస్తూ రిటైర్‌ అయిన డి.మరియమ్మ అనే హెల్పర్‌కు రూ.20 వేలు ఇంకా రాలేదు. తూబాబు సెక్టార్‌కు చెందిన కె.జోత్స్న పరిమళ అనే టీచర్‌ 8 నెలల కిందట రిటైర్‌ అయినా బెనిఫిట్‌ దక్కలేదు. మరోవైపు రిటైర్‌ అయిన టీచర్‌ స్థానంలో అర్హులైన హెల్పర్‌కు ప్రమోషన్‌ ఇవ్వడం లేదు. నియామకాల్లోనూ జాప్యం వల్ల ఉన్నవారిపైనే మిగతా పనిభారమూ పడుతోంది.ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలిపి.వెంకటేశ్వర్లు, డివిజన్‌ గౌరవాధ్యక్షులు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌.అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి. సిగల్‌ సమస్య వల్ల యాప్‌లలో వివరాల నమోదు కష్టంగా ఉంది. సొంత భవనాలున్న చోట రెండు సెంటర్లను కలిపి నిర్వహించాలని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల సమస్యలు వచ్చి పిల్లలు కేంద్రానికే రావడం లేదు. లబ్ధిదారులే వచ్చి రేషన్‌ తీసుకెళ్లాలని చెప్పడం, ముఖ ఆధారిత యాప్‌ను పెట్టడం వల్ల సిగల్‌ సమస్యతో ఇబ్బందులు వస్తున్నాయి. గతంలో ఇళ్లకే రేషన్‌ తీసుకెళ్లే విధానం ఉండేది. దీన్ని కొనసాగించాలి. ఇలా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27, 28 తేదీల్లో విజవాడలో నిర్వహించే మహాధర్నాకు కార్యకర్తలంతా తరలిరావాలి

➡️