జెవివి ఆధ్వర్యంలో ఎవల్యూషన్ డే ప్రజాశక్తి -రేణిగుంట : జెవివి ఆధ్వర్యంలో రేణిగుంట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల బాలుర ఉన్నత పాఠశాలలో ఎవల్యూషన్ డేను శుక్రవారం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డార్విన్ 1859 నవంబరు 24 న ”ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ ‘ జీవపరిణామ సిద్ధాంతం తెలిపే గ్రంథాన్ని వెలువరించిన రోజు అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఎవల్యూషన్ డేగా జరుపుతారన్నారు. ఈ సందర్భంగా జెవివి జిల్లా ఉపాధ్యక్షులు ఓ వెంకటరమణ మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రపంచంలో డార్విన్ ప్రతి పాదించిన పరిణామ సిద్ధాంతం మైలురాయి, నేడు కేంద్ర ప్రభుత్వమే డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశం నుండి తీసివేయడం మనుధర్మ మౌఢ్య భావాలతో నింపే ప్రయత్నం అన్నారు. మన ప్రజల ప్రగతికి అవరోధంగా నిలుస్తుందని, దేశ ప్రజలు శాస్త్రీయ దక్పథంతో ప్రగతి బాటలో పయనించాలంటే ఖచ్చితంగా ఇలాంటి శాస్త్రీయ ఆలోచన పెంచే ప్రయత్నమే ఈ కార్యక్రమం అన్నారు. జనవిజ్ఞాన వేదిక రేణిగుంట నాయకులు ఇమామ్ నెచురల్ సెలక్షన్ వివరించారు. ఈ కార్యక్రమంలో సహజ, ఉపాధ్యాయులు లావణ్య, విజయ, గజేంద్ర విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.