తప్పుల తడకగా ఓటరు జాబితా

ప్రజాశక్తి- పోరుమామిళ్ల ఇటీవల అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడాఖాగా మారింది. జాబితాలో మృతుల పేర్లు, డబుల్‌, బోగస్‌ ఓట్లు ఉన్నాయి. దీంతో ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిర్వహించిన ఇంటింటికీ సర్వే కూడా తూతూ మంత్రంగా చేశారనే విమర్శలున్నాయి. మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో అలాగే ఉంది. ఇదంతా అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరణించి ఏళ్లు గడుస్తున్నా ఓటర్‌ జాబితా నుంచి వారి పేర్లు అలాగే వస్తున్నాయి. ఓటర్‌ జాబితాలో ఎటువంటి తప్పులకు ఆస్కారం ఇవ్వద్దని ఎన్నికల సంఘం పదేపదే చెబుతున్నా అధికారులు ఏమాత్రం పట్టిం చుకోలేదని విమర్శలు వెలుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో చేపట్టిన ఇంటింటి సర్వే ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదని ముసాయిదా జాబితాను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ ఏడాది జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఓటర్‌ జాబితా సవరణకు బిఎల్‌ఒల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించారు. అందుకు బూత్‌ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చారు. జాబితాలో డబుల్‌ ఎంట్రీలు, నకిలీ, మతుల ఓట్లను గుర్తించి తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇంటింటి సర్వే పర్యవేక్షణకు గాను ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమించారు. ఇంత చేసినా తప్పులు అలాగే ఉండిపోయాయి. ప్రత్యేకంగా నియమించిన అధికారుల పర్యవేక్షణ బిఎల్‌ఒల పనితీరుపై పూర్తిగా విఫలమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు.రెండు చోట్ల… పోరుమామిళ్ల మండలం పరిధిలోని అక్కల రెడ్డిపల్లె పంచాయతీ పరిధిలో 41వ పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన ఓటురు జాబితాలో వరుస సంఖ్య 274లో దాసరిపల్లి బాలకష్ణ పేరుతో రెండు ఓట్లు ఉన్నాయి. పక్క పక్కనే డబుల్‌ ఓటు ఉన్నా తొలగించలేదు. అదేవిధంగా 41పోలింగ్‌ కేంద్రానికి సంబంధించి 755 ఓట్లు ఉంటే, అందులో 219, 221, 223, 228, 233, 241, 260, 272, 273, 275, 291, 294, 301, 306, 314 ఇంకా దాదాపు పదుల సంఖ్యలో మతుల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఒక పోలింగ్‌ కేంద్రంలోనే దాదాపు 30 నుండి 50 వరకు మతుల పేర్లు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే ఇంటింటి సర్వే ఏ మాత్రం జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.వేల సంఖ్యలోనే.. ముసాయిదా జాబితాలో వేల సంఖ్యలో మతుల ఓట్లు ఉన్నాయి. పోరుమామిళ్ల మండలం పరిధిలో అక్కల్‌రెడ్డి పల్లె గ్రామపంచాయతీలోని 41వ పోలింగ్‌ కేంద్రంలో 755 ఓట్లు ఉన్నాయి.41వ పోలింగ్‌ కేంద్రంలోనే దాదాపు 30 నుండి 50 మతుల ఓట్లు ఉన్నాయి. ఈ మతుల్లో ఉన్నవారు గతించి ఏళ్లు గడుస్తున్న వారి పేర్లను జాబితాలో నుంచి తొలగించేందుకు అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో.. అందుకు గల ఆంతర్యం ఏమిటో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వార్డులోని కొంత భాగంలో దాదాపు 50 వరకు మతుల పేర్లు ఉంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఆ సంఖ్య వేలల్లో ఉంటుందని ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.

➡️