27, 28న విజయవాడలో నిర్వహించేమహాధర్నాను జయప్రదం చేయండి

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పిలుపునిచ్చారు. శుక్రవారం సిఐటియు జిల్లా కార్యాలయాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాద, బడా కార్పొరేట్‌ అనుకూల విధానాలను అమలు చేసి దేశ ప్రజానీకంపై అన్ని రకాల భారాలు వేసి అసమానతలను పేదరికాన్ని నిరుద్యోగం పెంచి పోషిస్తున్నారని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచుకుంటూ సామాన్యులపై భారాలు మోపుతున్నారన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యలర్‌ చేయాలన్నారు. రైతులు, పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్త ప్రయో జనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులలోని లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు ఉదారంగా అందజేస్తూ, 9 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్‌ పేరుతో రుణమాఫీ చేసిందని చెప్పారు. వ్యవసాయ సంక్షోభం ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలు మాఫీ చేయడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. కార్పొరేట్‌ కంపెనీల రుణాలు మాఫీ చేయడం కాదని తెలిపారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓడరేవులు, ఎయిర్‌ పోర్టులు, విద్యుత్‌ సంస్థలు, రైల్వే, బొగ్గు గనులు, చివరకు ఆదివాసి, గిరిజనుల అటవీ భూములపై హక్కులను హరిస్తూ తాజాగా అటవీ చట్టానికి సవరణ పాస్‌ చేసిందని విమర్శించారు. ఈ చర్యలన్నీ కార్పొరేట్లకు ప్రత్యేకంగా మోడీ మానస పుత్రుడు గౌతమ్‌ అదానీని ప్రపంచ కుబేరులలో మొదటి స్థానానికి చేర్చేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచుతూ, కార్పొరేట్లకు ఐటి, ఎక్సైజ్‌, కస్టమ్స్‌, కార్పొరేట్‌ టాక్స్‌ల పైన లక్షలాది కోట్ల రూపాయల రాయితీలను ఇస్తున్నదని పేర్కొన్నారు. మరోవైపు కార్మికుల హక్కులను హరిస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చిందని తెలిపారు. ఫలితంగా బలహీన వర్గాల ప్రజల ఉపాధికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు లాభాలు పెంచి ప్రజల సంపదలు లూటీ చేస్తున్న కార్పొరేట్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు నాయకులు డి.వెంకట్రామయ్య, డి.భాగ్యలక్ష్మి, ఎస్‌.మెహరున్నీసా, ఎస్‌ ఓబులమ్మ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : విజయవాడ మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ పిలుపునిచ్చారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలతో కలిసి మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విఆర్‌ఎలు పెంచలయ్య, సుబ్బారాయుడు, అచ్చమ్మ పాల్గొన్నారు.

➡️