‘ఉక్కు’ సంకల్పంతో మున్ముందుకు- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Nov 24,2023 20:46 #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఉక్కు సంకల్పంతో కార్మికులంతా మున్ముందుకు సాగాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ కెఎస్‌ఎన్‌.రావు, కో-కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1016వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ఎస్‌ఎంఎస్‌ – 1 కార్మికులు కూర్చున్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం మెల్లు గణేష్‌ 22 రోజులపాటు ఉక్కు సంకల్పయాత్ర పేరిట తిరుపతి వరకు కాలినడకన వెళ్లి శుక్రవారం నాటికి విశాఖకు తిరిగి రాగా ఆయనను దీక్షా శిబిరం వద్ద అభినందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గణేష్‌ ఉక్కు కార్మికుడు కానప్పటికీ సంకల్పంతో పాదయాత్ర చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి తగ్గిందని తెలిపారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూడాల్సిన స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం తమకమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ – 3ని తక్షణం ప్రారంభించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూడాలన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖలో జరిగే కార్మిక, కర్షక మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి, కారు రమణ, గుమ్మడి నరేంద్ర, యు.వెంకటేశ్వర్లు, ఎస్‌ఎంఎస్‌ – 1 ప్రతినిధులు రమణమూర్తి, విడివి.పూర్ణచంద్రరావు, సుబ్బయ్య, మరిడయ్య, చంద్రశేఖర్‌, గణేష్‌ కుటుంబ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

➡️