ఫొటో : సిడిపిఒకు సమ్మె నోటీసు అందజేస్తున్న నాయకులుఅంగన్‌వాడీల సమ్మె నోటీసు అందజేతప్రజాశక్తి-అనంతసాగరం : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని, డిసెంబర్ 8వ తేదీ నుండి సమ్మెలో పాల్గొంటున్నట్లు శుక్రవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఒ పద్మావతికి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, సిఐటియు నాయకులు కలిసి సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ 8వ తేదీ నుండి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు సమ్మెలో పాల్గొంటున్నారని సమ్మె సందర్భంగా అనంతసాగరం ప్రాజెక్టు పరిధిలోని ఏ అంగన్‌వాడీ సెంటర్ కూడా పనిచేయవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీల సమస్యలను పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. గత శాసనమండలి సమావేశంలో అంగన్‌వాడీల సమస్యలు చర్చకు వచ్చినప్పుడు అంగన్‌వాడీ యూనియన్ నాయకులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్రా శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించినా ఇంతవరకు చర్చలు జరపలేదన్నారు. అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు పెంచుతామని చెప్పి ప్రస్తుతం మాట మార్చారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాడ్యూటీ, పెన్షన్ సౌకర్యం, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని చెప్పిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల యాప్‌ల పేరుతో అంగన్‌వాడీలపై పనిభారం పెంచుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చే వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషక పదార్థాలు నాణ్యత లోపించిన వాటిని అంగన్‌వాడీ సెంటర్లకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. అలాగే ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్, మూడు యాప్‌లను రద్దుచేసి ఒకే యాప్ విధానంలో అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ అయిన అంగన్‌వాడీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. అనేక నెలలుగా బకాయిలు ఉన్న అంగన్‌వాడీ సెంటర్ల అద్దెలను, 2017 నుండి ఆగి ఉన్న టిఎ, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలను పెంచి, ప్రభుత్వమే గ్యాస్ సప్లయి చేయాలని కోరారు. అంగన్‌వాడీలకుండే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెలో ప్రతిఒక్క అంగన్‌వాడీ టీచర్, ఆయాలు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనంతసాగరం ప్రాజెక్టు అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు నాగమణి, లక్ష్మి, సునీత, నూర్జహా, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.