ఘనంగా ఉయ్యాలవాడ జయంతి

Nov 24,2023 16:35 #Annamayya district

ప్రజాశక్తి కలికిరి: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు కలికిరి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ధరణి హోటల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపఠానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ శక్తివంతమైన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదురించి పోరాడి సమరశంఖం పూరించి, తెలుగు వారి పౌరుషాన్ని రుచి చూపించిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటూ
కొనియాడారు. కలికిరి పట్టణంలోని ధరణీ హోటల్ ఆవరణలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి 217వ జయంతి సందర్భంగా ఆయనకు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, అభిమానులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నినాదాలుచేసి కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఆనాటి భారత స్వాతంత్రం రాక ముందే బ్రిటీష్ దుష్ట పాలనను ఎదురించి తిరుగుబాటు చేసి, రేనాటి పౌరుషాన్ని పరిచయం చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ అన్నారు.
రాయలసీమలో రాయల కాలం నుండి 18వ శతాబ్దంలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేదని వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరని, నిజాం నవాఁబ్ రాయలసీమ ప్రాంతాలను బ్రిటీష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటీష్ ప్రభుత్వ అధికారంకిందికి వచ్చారని, పాలెగాళ్ల ఆస్తులపై, వారి మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించు కోవాలనే ఉద్దేశంతోనే వారిపై పన్నుల భారం మోపి, వేధింపులకు గురిచేచేవారని అవి సహించలేక బ్రిటీష్ అధికారాల్ని కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను వ్యతిరేకిస్తూ, ఆంగ్లేయుల దాష్టికాల్ని చీల్చి చెండాడుతూ, బ్రిటీష్ సైన్యాన్ని మట్టికరిపిస్తూ తెల్లవాడికి భయపడే గుండె కాదు అంటూ వళ్ళు గగ్గురపొడిచే పోరాటంతో బ్రిటీష్ దుష్టపాలనపై తిరుగుబాటుచేసి పరుగులు పెట్టించారని, వెయ్యి ఏనుగుల బలాన్ని నిలువరించే బ్రిటీషర్ల సైన్యాన్ని ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పేరు చెబితే సింహస్వప్నం అన్నారు. అప్పటి బ్రిటీష్ వారు ఆయనకు మోసంతో బంధించి ఉరి తీయించారని తిరుగు బాటు దారుల్ని భయ భ్రాంతులు చేయడానికి ఆయన తలను సంవత్సరాలపాటు వేలాడదీశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన నిర్మించిన కోటలు కర్నూలు, బళ్ళారి, అనంత పురం, కడప జిల్లాల్లో ఇప్పటికి ఉన్నాయన్నారు. ఆయన కర్నూలు జిల్లా రూపనగుడి గ్రామంలో జన్మించారని, ఉయ్యాల వాడ, కోవెలకుంట, రూపన గుడి గ్రామాల్లో ఆయన చిత్రాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయని అన్నారు. ఆయన చరిత్ర గ్రామాల్లో జానపద వీర గాధల్లో తెలియ జేసేవారని ఎంత చెప్పినా, విన్నా తనివితీరదని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు రాంప్రసాద్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, శేష్ కుమార్ రెడ్డి, శేషాద్రిరెడ్డి, కె రెడ్డెప్పరెడ్డి, చంద్రారెడ్డి, వెంకటరమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, నిజాముద్దీన్, తాతి రెడ్డి,జయరాం రెడ్డి శ్రీనివాసులురెడ్డి, భాస్కర్ రెడ్డి, రమేష్, సుధాకర్ రెడ్డి, రాజారెడ్డి,ప్రభాకర రెడ్డి,G జనార్ధన రెడ్డి, అమరనాద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️