తెలంగాణలో నాలుగైదు రోజుల పాటు వర్షాలు

Nov 24,2023 15:50 #heavy rains, #Telangana

తెలంగాణ: క్రింది స్థాయి ఈశాన్య, ఆగేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలులు వీస్తున్నాయని.. రాబోయే నాలుగైదు రోజులు పాటు తెలంగాణలో మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సీనియర్‌ ఆఫీసర్‌ శ్రావణి పేర్కొన్నారు. ఈశాన్య జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నల్గండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జనగాం, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈనెల 25, 26న దక్షిణ అండమాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఇది మరింత బలపడి అల్పపీడనం ఈనెల 27, 28వ తేదీ వరకు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పారు. దీంతో కర్ణాటక, కేరళ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సీనియర్‌ ఆఫీసర్‌ శ్రావణి వెల్లడించారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం కూడా ఉండనుంది.. తెలంగాణపై ప్రభావం తక్కువ ఉండనున్నట్లు తెలిపారు. ఈ వర్ష ప్రభావం వల్ల ఈ రెండు రోజులు ఉదయం పూట ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు వెల్లడించారు. రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా తగ్గుదల ఉండే అవకాశం, రాత్రి పూట ఉష్ణోగ్రతలు 19, 20 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.హైదరాబాద్‌ నగరంలో మేఘావృతమైన వాతావరణం ఉండనుంది.. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఉండడం కారణంగా వర్షాల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. గడిచిన ఐదు సంవత్సరాల కంటే ఈ ఏడాది వెచ్చదనం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా రైతులకు వాతావరణ హెచ్చరికలు కూడా జారీ చేశామన్నారు.

➡️