న్యూఢిల్లీ : బిజెపిని, జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఇపి)ని తిరస్కరిద్దాం..విద్యా, ఉపాధి రంగాలను కాపాడుకుందాం అనే నినాదంతో భారత ఐక్య విద్యార్థి (యునైటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా – యుఎస్‌ఐ) ఏర్పాటైంది. విద్యా, ఉపాధి రంగాల్లో హిందూత్వ అజెండాతో కేంద్ర ప్రభుత్వం అమల్జేస్తున్న వినాశకర విధానాలపై పోరాడేందుకు 15 విద్యార్థి సంఘాలతో కలిసి ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) తెలిపింది. ‘విద్యను పరిరక్షించుకుందాం..ఎన్‌ఇపిని తిరస్కరిద్దాం..బిజెపిని తరిమికొడదాం’ నినాదంతో యుఎస్‌ఐ పోరాడనుందని పేర్కొంది. దేశం నలుమూలల్లో వివిధ రూపాల్లో ఆందోళనలను చేపట్టిన తర్వాత వచ్చే ఏడాది జనవరి 12న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ తెలిపింది. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న చెన్నరులో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొంది.