ప్రజాశక్తి-యర్రగొండపాలెం- అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 8వ తేదీ నుంచి నిరవధికంగా జరిగే సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ యర్రగొండపాలెంలోని సీడీపీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్యామ్‌కు అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, గ్రాడ్యూటీ చెల్లించాలని సుప్రీంకోర్టు 2022 సంవత్సరంలోనే తీర్పు ఇచ్చినప్పటికీ నేటికీ అమలు చేయలేదని చెప్పారు. వెంటనే అమలు చేయాలని కోరారు. మినీ సెంటర్లను తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చి మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.5 లక్షలకు పెంచాలని అన్నారు. ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఇవ్వాలని తెలిపారు. హెల్పర్ల ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించి రాజకీయ జోక్యాన్ని అరికట్టి పదోన్నతి వయస్సును 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. విధుల్లో ఉండి చనిపోయిన అంగన్‌వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమాను అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలను పెంచాలని, వంటగ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, బకాయి పడిన సెంటర్ 2017 నుంచి టిఎ బిల్లులు, ఇతర బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పద్మావతి, రామకుమారి, సుభాషిణి, మల్లేశ్వరి, సుబ్బరత్నాలు, నసీమా, విజయలక్ష్మి, తిరుపాలమ్మ, కోటేశ్వరి, శాంతిబాయి, షంషాద్, రూత్‌మేరి, బేబిరాణి తదితరులు పాల్గొన్నారు.