మత్స్యకారులకు సంపూర్ణ సహకారం

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖ)  ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమై నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. జిల్లా పరిషత్‌ అసెంబ్లీ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బోట్లు దగ్ధమైన వారికి, జీవనోపాధి కోల్పోయిన హమాలీలకు, చిరు వ్యాపారస్తులకు రూ.7.11 కోట్లు పరిహారాన్ని గురువారం మంత్రి సిదరి అప్పలరాజు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో హుదూద్‌, తిత్లీ తుపాను సమయంలో జరిగిన నష్టాలపై ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయలేదన్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యకార భరోసా ఇస్తున్నారని, డీజిల్‌ సబ్సిడీ పెంచి ఇస్తున్నారని, మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విపత్తులు వచ్చినప్పుడు మత్స్యకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. సంఘటనలో 30 బోట్లు పూర్తిగా, 19 బోట్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయని, వారందరికీ పూర్తి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఇన్స్యూరెన్స్‌ లేని వారికి కూడా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు 80 శాతం నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపారు. బోట్లు యజమానులతో పాటు అందులో పని చేసే కళాసీలను కూడా ఆదుకోవాలని నాయకులు కోరడంతో వారికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున అందిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు సబ్సిడీపై బ్యాంకు రుణాలు ఇప్పించే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదం జరిగిన నాలుగు రోజుల్లోనే నష్టపరిహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఆయిల్‌ సబ్సిడీ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ పేర్ల విజరుచందర్‌, వాసుపల్లి జానకిరామ్‌, జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, ఆర్‌డిఒ హుస్సేన్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️