వర్సిటీలో ఐదేళ్ల లా కోర్సు

ప్రజాశక్తి – ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతున్న ఐదేళ్ల లా కోర్స్‌కు సంబంధించి వివరాలతో కూడిన బ్రోచర్‌ను వీసీ పి.రాజశేఖర్‌ గురువారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రెండు దశాబ్దాల తర్వాత వర్సిటీలో ఎల్‌ఎల్‌బి కోర్సును డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పేరుతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదికి బిఎ ఎల్‌ఎల్‌బి హానర్స్‌, బిబిఎ ఎల్‌ఎల్‌బి హానర్స్‌ కోర్సులు నిర్వహిస్తామని, ఒక్కొక్క దానిలో 60 సీట్లు చొప్పున మొత్తం 120 సీట్లు ఉంటాయని చెప్పారు. అడ్మిషన్ల నిమిత్తం ఏపీ లా సెట్‌ నవంబర్‌ 17 నుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభించిందని, 25వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వెబ్‌ ఆప్షన్స్‌ ద్వారా ఐదేళ్ల న్యాయవిద్య కోసం వర్సిటీలోని క్యాంపస్‌ కళాశాలలో ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఒకవేళ ఎవరైనా ఈ విద్యా సంవత్సరంలో ఏపీ లా సెట్‌ రాయక పోయినా, ర్యాంకు సాధించి కళాశాలలో సీటు పొందలేకపోయినా వారికి ఈ విశ్వవిద్యాలయంలో మిగిలిన సీట్లని కేటాయిస్తామని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పాటు పదవిలో కొనసాగుతున్న, పదవీ విరమణ చేసిన వివిధ న్యాయ నిపుణులు, న్యాయమూర్తులు తమ అనుభవాలను అందించే విశేష అవకాశం ఉందని, ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్‌ సదుపాయమూ ఉందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎల్‌.జయశ్రీ, డాక్టర్‌ గౌరీ, డాక్టర్‌ రమణ, డాక్టర్‌ సతీష్‌, డాక్టర్‌ కిషోర్‌, ఎస్‌.చంద్రశేఖర్‌, అభిలాష్‌, శశికిరణ్‌ పాల్గొన్నారు.

➡️