రైల్వే ప్రైవేటీకరణ దేశద్రోహమేసిఆర్‌ఎస్ ‘గేట్ మీటింగ్’లో సిహెచ్ నర్శింగరావు ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా అక్కడ కార్మికులు ఐక్య పోరాటాలతో తిప్పికొడుతున్నారని, అదే తరహాలో రైల్వే ప్రైవేట్‌పరం కాకుండా ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. రైల్వేను ప్రైవేటీకరించడం దేశద్రోహం అవుతుందన్నారు. గురువారం రేణిగుంట రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ ఆవరణంలో సాయంత్రం కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. రైల్వే కార్మికులను ఉద్దేశించి నర్సింగరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమ్మకానికి పెట్టారని గుర్తు చేశారు. ఇందులో బిఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసి, ఓఎన్జిసి గ్యాస్, బ్యాంకింగ్ వంటి రంగాలు ప్రైవేట్ పరం చేసి అదాని, అంబానీలకు కట్టబెట్టేందుకు పూనుకున్నారన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కుట్ర చేశారని, అక్కడ వేయి రోజులుగా కార్మికులు ఐక్యంగా పోరాటంతో ఒక్క శాతం కూడా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాలేదని గుర్తు చేశారు. రైల్వేలను ప్రైవేటుపరం చేయడానికి మోడీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టిందని. కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడితే ప్రైవేట్ పరాన్ని అడ్డుకోవచ్చని చెప్పారు. రైల్వే ని వ్యాపార సంస్థగా మార్చడానికి దేశంలో ఉన్న 400 రైల్వే స్టేషన్లను అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు, చర్యలు తీసుకున్నారని. కార్మిక వర్గం మౌనంగా ఉండకుండా ఐక్యతతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ గుజరాత్ లో కొన్ని రైల్వేస్టేషన్లో ప్రైవేటుపరం చేశారని అయితే అక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కూడా పలు పోర్టులను అదానికి కట్టబెట్టారని గుర్తు చేశారు. ఇటీవల దేశంలో జరిగిన రైలు ప్రమాదానికి రైల్వేలో కొన్ని విభాగాలను ప్రైవేట్‌పరం చేయడమేనన్నారు. రైల్వేలో ఖాళీగా ఉన్న మూడు లక్షల 50 వేల పోస్టుల భర్తీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. రైల్వేలో భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని, సబ్సిడీలను కొనసాగించాలని, ప్యాసింజర్ రైళ్లు నడపాలని రైల్వే కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రేణిగుంట సిఆర్‌ఎస్ కార్మికులు పని ఒత్తిడికి గురవుతున్నారని, ఇక్కడ ఉన్న ఖాళీలను వెంటనే కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సిఆర్‌ఎస్ సామర్థ్యాన్ని పెంచి, యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఐఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేరత్నకుమార్ మాట్లాడుతూ రైల్వే ప్రైవేట్ కాకుండా తమ సంఘం ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ రైల్వే ప్రైవేటీకరణకు మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి కసరత్తు చేస్తోందని, దీన్ని సిఐటియు పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. రైళ్ల ప్రమాదానికి కారణం మోడీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రైల్వేల అభ్యున్నతికి మోడీ ప్రభుత్వం కషి చేయడం లేదన్నారు. అదాని అంబానీల కోసమే రైల్వే ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. రైల్వే కార్మికులు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు అంగేరి, పుల్లయ్య, జిబిఎస్ మన్యం, ఓ వెంకటరమణ, హరినాధ్, టి సుబ్రహ్మణ్యం, రేణిగుంట సిఆర్‌ఎస్ మజ్దూర్ యూనియన్ నాయకులు సురేంద్ర రెడ్డి, మునెయ్య, సూర్యనారాయణ, రమణ పాల్గొన్నారుసిఆర్‌ఎస్ గేట్ మీటింగ్‌లో ప్రసంగిస్తున్న సిహెచ్ నర్శింగరావు