జిఎస్‌ఎల్‌తో నన్నయ ఎంఒయు

నన్నయ ఎంఒయు

ప్రజాశక్తి-రాజానగరం జిఎస్‌ఎల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. గురువారం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో విసి ఆచార్య కె.పద్మరాజు సమక్షంలో జిఎస్‌ఎల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ గన్ని భాస్కరరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ ఎంఒయు పత్రాలపై సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విసి మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, జిఎస్‌ఎల్‌ వివిధ అంశాలపై పరస్పర ప్రయోజనలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని చెప్పారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ సహకారంతో జిఎస్‌ఎల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో ఆసక్తిగల విద్యార్థులకు, సిబ్బందికి యోగా డిప్లమా, యోగా పీజీ డిప్లమా కోర్సులను అందిస్తున్నామన్నారు. జిఎస్‌ఎల్‌ సహకారంతో విశ్వవిద్యాలయ విద్యార్థులకు, సిబ్బందికి ఫార్మసీ మినహా వర్తించే అన్ని ఛార్జీలపై 25 శాతం తగ్గింపు ఇస్తారని, ఉచిత అంబులెన్స్‌ సర్వీసులను అందిస్తారని చెప్పారు. ఎంపిఇడి కోసం ఫిజియోథెపీ ల్యాబ్‌ శిక్షణ ఇస్తారని తెలిపారు. జిఎస్‌ఎల్‌ చైర్మన్‌ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ తన తల్లి గన్ని సుబ్బలక్ష్మి పేరుతో ప్రారంభించిన జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజ్‌ 20 ఏళ్లుగా విజయవంతంగా నడుపబడుతుందన్నారు. యోగా డిప్లమా, యోగా పీజీ డిప్లమా కోర్సులు విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. నన్నయ విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థులకు జిఎస్‌ఎల్‌ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వాటని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ సభాధ్యక్షుడు ప్రిన్సిపల్‌ ఆచార్య డి.జ్యోతిర్మయి, జిఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ వి.హర్ష, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.అప్పారావు, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.చతుర్వేది, యోగా టీచర్‌ పి.ఆశ, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.

➡️