– పోంజీ స్కీమ్ కేసులో విచారణకు రావాలని ఆదేశం
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల నేతలు, ప్రశ్నించే గళాలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ విమర్శలు ఎదుర్కొంటోన్న మోడీ సర్కార్ తాజాగా ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌పై దృష్టి సారించింది. నగల వ్యాపారంతో ముడిపడి ఉన్న రూ.100 కోట్ల పోంజీ స్కీమ్‌లో ప్రకాష్‌రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు పంపింది. కేసు దర్యాప్తులో భాగంగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈ స్కీమ్‌ను నడుపుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్‌కు ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. పోంజీ స్కీమ్‌ను అమలు చేసి రూ. 100 కోట్లతో పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలతో చెన్నైతో సహా తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో శాఖలను కలిగి ఉన్న ఆభరణాల గొలుసు శాఖలు, యజమానుల ఇండ్లపై ఇడి దాడులు చేసింది. ఈ నగల వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నటుడు ప్రకాష్ రాజ్ ఈ విషయంపై ఇంకా ప్రకటన ఇవ్వలేదు.ప్రణవ్ జ్యువెలర్స్ నిర్వహిస్తున్న దుకాణాలు అక్టోబర్‌లో మూసివేయబడ్డాయి. ఫిర్యాదుల ఆధారంగా తమిళనాడులోని తిరుచ్చిలో జ్యువెలర్స్ యజమాని మధన్‌పై కేసు నమోదైంది. ఈ నెల ప్రారంభంలో యజమాని, అతని భార్యపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేయబడ్డాయి. ప్రణవ్ జ్యువెలర్స్ అధిక రాబడిని అందించే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ పేరుతో రూ.100 కోట్లు వసూలు చేసిందని రెండ్రోజుల క్రితం ఇడి ఒక ప్రకటనలో పేర్కొన్నది. రాబడులు కార్యరూపం దాల్చకపోవడమే కాకుండా, ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని కూడా పెట్టుబడిదారులకు తిరిగి ఇవ్వలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.నటుడు ప్రకాశ్‌రాజ్ గత కొన్నేండ్లుగా కేంద్రంలోని అధికార బిజెపికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపస్తున్నారు. మోడీ సర్కారు విధానాలను అనేక సందర్భాల్లో ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇడి ప్రకాశ్‌రాజ్‌ను టార్గెట్ చేయటం గమనార్హమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.