‘భరోసా’ ఇవ్వని సామాజిక బస్సు యాత్రలు

Nov 19,2023 01:16 #palanadu

 

గుంటూరు : ఉమ్మడి గురటూరు జిల్లాలో సామాజిక సాధికారిక బస్సు యాత్రలు ప్రజలకు తగిన భరోసాను ఇవ్వలేకపో తున్నాయి. మూడు దశల్లో జరిగే ఈ యాత్రలు ఇప్పటి వరకు తెనాలి, పెదకూరపాడు, వినుకొండ, మాచర్ల, గుంటూరు తూర్పు, పొన్నూరు,బాపట్ల నియోజకవర్గాల్లో జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన సభల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు,వైసిపి సమన్వయకర్తలు పాల్గొంటున్నారు. ఈ యాత్రల్లో ప్రజలను సమీకరించ డానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తంటాలు పడుతు న్నారు. నాలుగున్నర ఏళ్ల తరువాత కూడా యాత్రల కోసం ప్రజలను సమీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతాకాదు. డ్వాక్రా మహిళలు, పథకాల్లోని సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు, వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులను బస్సు యాత్రలకు రావాలని ఎమ్మెల్యేలు హుకుం జారీ చేస్తున్నారు. ఈమేరకు వాహనాలను ఏర్పాటు చేసి గ్రామాల నుంచి పట్టణాలకు తరలిస్తున్నారు. తొలి సారిగా జరిగిన తెనాలిలో బస్సు యాత్రకు ప్రజా స్పందన లేదని వైసిపి అధిష్టానంకు నివేదికలు వెళ్లాయి. మిగతా సభలు కొంత వరకు మెరుగ్గా ఉన్నట్టు ఐ.ప్యాక్‌ బృందాలు నివేదించాయి. అన్నింటి కన్నా వినుకొండ, బాపట్ల, మాచర్ల, పొన్నూరు, పెదకూరపాడులో బస్సు యాత్రల్లో ప్రజలను సమీకరించడంలో ఎమ్మెల్యేలు సఫలీకృతులయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు ప్రచారంగా ఈ బస్సు యాత్రలను నిర్వహిస్తున్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన తక్కువగా ఉంటోంది. సిఎం జగన్‌ను పొగడటం, ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై విమర్శలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసిపిని గెలిపించాలని కోరుతున్నారు. అయితే ప్రజా సమస్యల ప్రస్తావన ఉండటం లేదు. వీటి పరిష్కారం కోసం వేచి చూసే వారికి కూడా నిరాశ ఎదురవుతుంది. ప్రధానంగా జిల్లాలో రహదారులు అధ్వానంగాఉన్నాయి. సాగునీటి సరఫరా లేక రైతులు అల్లాడుతున్నారు. వర్షాభావంతో కరువు తీవ్రతగా ఈ అంశాల జోలికి మంత్రులు, ఎంపిలు,ఎమ్మెల్యేలు వెళ్లడంలేదు. జగనన్నకాలనీల్లో గృహ నిర్మాణాలు పూర్తికాకపోయినా వాటి గురించి ప్రస్తావించడంలేదు. వీటిని ఎలా పూర్తిచేయాలో కూడా భరోసా ఇవ్వడం లేదు. నిత్యావసర వస్తువులు ధరలు భారీగాపెరుగుతున్నాయి. విద్యుత్‌ ఛార్జీల భారం మూడేళ్లుగా వెంటాడుతోంది. వీటిని భవిష్యత్తులో తగ్గిస్తామని కానీ, భారం కొద్ది రోజుల తరువాత ఉండదనికూడా భరోసా ఇవ్వడం లేదు. అలాగే ఇప్పటికీ సంక్షేమ పథకాలు అందని వారి గురించి పట్టించుకోవడంలేదు. గత ఏడాదికాలం రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేస్తే ఆరునెలలకు ఇస్తున్నారు. తరువాత కార్డు వచ్చిన తరువాత పింఛన్లకు దరఖాస్తు చేస్తే మళ్లీ ఆరునెలలు ఆగాల్సి వస్తుందని అయినా ఈ అంశాలను ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువురు పేదలు వాపోతున్నారు. సామాజిక యాత్ర అని చెబుతున్నా జిల్లాలో ఎస్‌సి,ఎస్‌టి, బిసి,మైనార్టీలపై దాడులు జరగకుండా కూడా చూస్తామని,వీరి ఆస్తులకు రక్షణ కల్పిస్తామన్న భరోసా కల్పించలేకపోతున్నారు.
(ఎ.వి.డి.శర్మ)

తాజా వార్తలు

➡️