బాలల్లో సృజనాత్మకతను పెంపొందించాలి: జెసి

Nov 21,2023 22:45 #ntr district

 

ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్సిటీ : బాల బాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడం ద్వారా, వారి బాల్యాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ అన్నారు. బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా, అను మై బేబీ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలను నిర్వహించారు. చదరంగం, వక్తత్వం, బాలల హక్కులపై నివేదిక రూపొందించడం, క్విజ్‌, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్‌, స్కిట్స్‌ అంశాల్లో పోటీలు నిర్వహించారు. సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జెసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజేతలలైన చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. జెసి మాట్లాడుతూ భవిష్యత్‌ సమాజం మెరుగ్గా ఉండాలంటే బాలలకు వారి హక్కులను కల్పిస్తూ, మెరుగైన అవకాశాలను కల్పించాలని సూచించారు. ముఖ్యంగా.. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, విద్యావకాశాలను అందించాలని అన్నారు. అను గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ గాజుల రమేష్‌ మాట్లాడుతూ అను మై బేబీ హాస్పిటల్‌ ద్వారా బాలలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నామని తెలియజేశారు. చిన్నారుల మనో వికాసానికి, వారిలో సజనాత్మకత, విజ్ఞానాలను పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ రమేష్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ జి.శ్రీదేవి, డాక్టర్‌ దుర్గానాగరాజు, డాక్టర్‌ కె.వి. రవికుమార్‌, డాక్టర్‌ కె. కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️