ప్రజాశక్తి – హెల్త్ యూనివర్శిటీ : వ్యాధి నిరోధక టీకాలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా అవసరమని, పెద్దలకు వేసే వ్యాధి నిరోధక టీకాల గురించి అవగాహన అవసరమని ప్రముఖ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణ అన్నారు. బెంజిసర్కిల్ వద్ద గల వాసవ్య నర్సింగ్ హోమ్‌లో ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం అధ్యక్షతన ‘వయోజనులకు రోగనిరోధక టీకాలు’ అనే అంశంపై శనివారం ఆరోగ్య సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వయసు వచ్చాక కొందరికి కొన్ని వ్యాధులు అతి తేలికగా సంక్రమిస్తాయన్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతోనూ, చినకనతనంలో వేసిన కొన్ని వ్యాక్సిన్ల పవర్ తగ్గిపోవడంతోనూ తలెత్తే వ్యాధులు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. అందుకని కొన్ని రకాల వ్యాక్సిన్లు పెద్దలకు వేయాల్సి వస్తుందన్నారు. పెద్ద వారిలో హైపటైటిస్ -బి, వేరిసెల్లా, మెనింగోకోకల్, యం.యం.ఆర్, న్యూమోకోకల్, హైపటైటిస్ -ఎ, హెచ్పివి, హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్లు ముఖ్యమైనవని అన్నారు. పెద్దవాళ్లకి సంబంధించిన వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల హాయిగా, ఆరోగ్యంగా, సురక్షితంగా జీవించవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో డాక్టర్ మారు పాల్గొని వందన సమర్పణ చేశారు.