ప్రజాశక్తి – మైలవరం : ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ పేరుతో టిడిపి జనసేన సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జి.కొండూరు మండలంలోని గడ్డమనుగులో నిరసన చేపట్టారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అక్కల రామ్మోహన్‌రావు గోతుల్లో మట్టి పోసి పూడ్చారు.ఎ.కొండూరు : వైసిపి నాయకులు తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని అహంకార చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులను బెదిరిస్తున్నారని వారి అహంకార చర్యలను మానుకోవాలని టిడిపి జనసేన నాయకులు హెచ్చరించారు. శనివారం మండలంలోని కంభంపాడు గ్రామంలో టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ శావల దేవదత్ జనసేన జిల్లా కార్యదర్శి తిరువూరు నియోజకవర్గ సమన్వయ కర్త మనుబోలు శ్రీనివాసరావు, మండల టిడిపి అధ్యక్షుడు గడ్డి కష్ణారెడ్డి, జనసేన కార్యకర్తలు కంభంపాడులో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం విస్సన్నపేట ఎ.కొండూరు రోడ్డుపై కుమ్మరి కుంట సమీపంలో కూలిన ఏడు కానాల వంతెనను పరిశీలించి అక్కడ వైసిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షుడు బెజవాడ శంకర్ బాణావత్ బీమా నాయక్, తదితరులు పాల్గొన్నారు. కంచికచర్ల : రాష్ట్ర తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణ గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది కార్యక్రమంలో భాగంగా శనివారం గుంతలు పడి ధ్వంసమైన రోడ్లను పరిశీలించారు. మాజీ ఎంఎల్‌ఎ తంగిరాల సౌమ్య, జనసేన నియోజకవర్గం ఇన్‌ఛార్జి తంబళ్లపల్లె రమాదేవి, నాయకులు చెవిటికల్లు మున్నలూరు గ్రామం రహదారిలో గుంతలను పరిశీలించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కోగంటి బాబు, నాయకులు పాల్గొన్నారు. భవానీపురం : 43వ డివిజన్‌లో హారికా రెస్టారెంట్, ఊర్మిళానగర్ రోడ్డు, గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది… డిజిటల్ క్యాంపైన్ స్థానిక అధ్యక్షులు జెల్లీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్, నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొని రోడ్డు యొక్క దుస్థితిని పరిశీలించి అనంతరం స్థానిక ప్రజలను గత మూడు సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడం వలన జరుగుతున్న ప్రమాదాలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షులు జెల్లీ. రమేష్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. వన్‌టౌన్ : తమ హయాంలో బిసిలకు తీరని అన్యాయం చేసిన టిడిపి, జనసేన నాయకులకు బిసి సంక్షేమంపై మాట్లాడే అర్హతలేదని ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహిద్దిన్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజులుగా టిడిపి, జనసేన నాయకులు బిసిల సంక్షేమంపై, కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. టిడిపి, జనసేన నాయకులు అవాకులు చవాకులు మానాలని లేకుంటే బిసిలే వారికి తగిన బుద్ధి చెబుతారని గౌస్ మొహిద్దిన్ హెచ్చరించారు. ఈ సమావేశంలో బిసి దండోరా రాష్ట్ర నాయకులు సి.రత్నం, తదితరులున్నారు.