యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ‘అటల్‌ ల్యాబ్స్‌’ లక్ష్యం

Nov 23,2023 10:29 #AP Education, #Labs
atal-tinkering-labs-in-schools-powered-by-isro

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంగా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌ అన్నారు. ల్యాబ్‌లపై రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైన్స్‌ పట్ల విద్యార్థుల్లో అభిరుచి కల్పించడమే ఉపాధ్యాయుల వంతు అని అన్నారు. ఇటీవల సైన్స్‌ ప్రాజెక్టుల ప్రదర్శనకు ముగ్గురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జపాన్‌ వెళ్లడం అభినందనీయమని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థులకు కావాల్సిన ఆత్మస్థైర్యం ఈ ల్యాబ్‌ ద్వారా అందుతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 577 ల్యాబ్‌లు ఉన్నాయని, వీటిల్లో 31 హబ్‌ఎటిల్‌గా గుర్తించామని చెప్పారు. జిల్లా స్థాయి సైన్స్‌ పోటీల విజేతలను ఆ జిల్లాల కలెక్టరుతో సమావేశపరిస్తే విద్యార్థుల్లో మరింత ఉత్సాహం పెంపొందుతుందని తెలిపారు. సమగ్ర శిక్ష డైరెక్టరు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సైన్స్‌ ద్వారా విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేయాలని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో సైన్స్‌ పరికరా లను ఉపయోగించడం లేదని అన్నారు. ల్యాబ్‌ల వినియోగంలో దేశవ్యాప్తంగా ఎపి ముందంజలో ఉందని అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (ఎఐఎం) డైరెక్టర్‌ దీపాళి ఉపాధ్యారు అన్నారు. ల్యాబ్‌ నిర్వహణ 13 సూచికల పోస్టరును ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ బి ప్రతాప్‌ రెడ్డి, సమగ్ర శిక్ష జాయింట్‌ డైరెక్టరు విజయ భాస్కర్‌, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. విద్యార్థులకు విదేశీ భాషల అధ్యయనంపై ఇప్లుతో సమావేశంప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విదేశీ భాషల అధ్యయనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, యువతకు విదేశీ భాషలను నేర్పించే అవకాశాలపై కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఇంగ్లీష్‌, ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇప్లు) విసి ఇ సురేష్‌కుమార్‌తో బుధవారం హైదరాబాద్‌లో చర్చించారు. సిబిఎస్‌ఇకి అనుసంధానమైన 1000 పాఠశాలల్లో విద్యార్థులకు ఐచ్ఛిక భాషగా జర్మన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జపనీస్‌, మాండరీస్‌, కొరియన్‌ దేశాల భాషల అధ్యయన అవకాశాలను చర్చించారు. త్వరలో నిర్ణయం తీసుకుని కార్యాచరణను ప్రకటిస్తామని సురేష్‌కుమార్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ బి ప్రతాప్‌ రెడ్డి, అసెస్మెంట్స్‌ ఇన్‌ఛార్జి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️