మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత శంకరయ్య

tamilnadu cpm leader n sankaraiah profile article

కామ్రేడ్‌ ఎన్‌.శంకరయ్య వందవ పుట్టినరోజు సందర్భంగా సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు జి.రామకృష్ణన్‌ 2021 జులై 18న రాసిన వ్యాసమిది. శంకరయ్య మరణానంతరం నివాళులు అర్పిస్తూ ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ పున:ముద్రించింది.

1922 జులై 15న జన్మించిన కామ్రేడ్‌ ఎన్‌.శంకరయ్య ఎన్‌.ఎస్‌గా సుపరిచితుడు. 2021 జులై 15వ తేదీన ఆయన తన వందవ సంవత్సరంలోకి ప్రవేశించాడు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, భావజాల, సాంస్కృతిక తదితర రంగాలలో తనదైన ముద్ర వేసిన గొప్ప యోధుడు. అటు రాజకీయ రంగంలో, ఇటు కుటుంబ జీవితంలో ఒక కమ్యూనిస్ట్‌గా ఉండడం ఎలా అనేందుకు ఆయన జీవితమొక నమూనాగా నిలుస్తుంది. మనకు మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తినిస్తుంది.శంకరయ్య యువకుడుగా ఉన్న రోజుల్లో సామాజిక సంస్కరణలు, నాస్తికత్వ విధానాలతో కూడిన ఆత్మగౌరవ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో, కమ్యూనిస్టు పార్టీ మాత్రమే సంపూర్ణ స్వాతంత్య్రం నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. శంకరయ్య ఈ పరిణామాలన్నిటినీ గమనించి, ఆర్థిక సమానత్వంతో కూడిన కుల రహిత సమాజానికి దారితీసే సామాజిక మార్పే దీనికి పరిష్కారమనీ, ఈ లక్ష్యం దిశగా మానవాళిని నడిపించేది కూడా మార్క్సిజం మాత్రమే అనే నిర్ణయానికి వచ్చాడు. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే శంకరయ్య భారత కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యుడయ్యాడు. మధురై జిల్లాలో ఏర్పడిన మొట్టమొదటి పార్టీ శాఖ కూడా ఇదే.రాజకీయ ఖైదీగా…మధురై లోని అమెరికన్‌ కళాశాల విద్యార్థి సంఘానికి శంకరయ్య అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. అతి కొద్ది కాలంలోనే ఆయన రాష్ట్ర స్థాయి విద్యార్థి నాయకునిగా గుర్తింపు పొందాడు. పోలీసులు అరెస్ట్‌ చేసిన అన్నామలై విశ్వవిద్యాలయం విద్యార్థులపై జరిగిన హింసాత్మక దాడులను ఖండిస్తూ ఒక శక్తివంతమైన కరపత్రాన్ని ఆంగ్లంలో రాశాడు. ”తలలు పగుల గొడుతున్నారు, ఎముకలు ముక్కలుగా విరగ్గొడుతున్నారు, అన్నామలై విశ్వవిద్యాలయంలో రక్తపు నది ప్రవహిస్తున్నది” అని…నాటి దారుణ దృశ్యాన్ని విస్తృతంగా పంపిణీ జరిగిన ఆ కరపత్రంలో శంకరన్‌ పేర్కొన్నాడు. వార్షిక పరీక్షలకు కేవలం 15 రోజుల ముందు పోలీసులు శంకరయ్యను అరెస్ట్‌ చేసి, జైలుకు పంపారు. పద్దెనిమి నెలల తర్వాత మాత్రమే ఆయనను విడుదల చేశారు.శతాబ్దాల తరువాత ఆయనను ఈ ప్రశ్నను అడిగాను: ”మీరు న్యాయవాది అవ్వాలని మీ నాన్నగారు కోరుకున్నారు. ఫైనల్‌ పరీక్షలకు కేవలం పక్షం రోజుల ముందే మీరు అరెస్ట్‌ అయ్యారు. అంటే మీరు మీ చదువు కొనసాగించరు, లా డిగ్రీ సాధించరు, న్యాయవాది అవ్వరని అర్థం. ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టంగా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్‌ చేసినప్పుడు, మీ మానసిక స్థితి ఏంటి?” ఆయన సమాధానం ఇలా ఉంది: ”నేను స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు అరెస్ట్‌ చేసి, జైలుకు పంపిన ప్రక్రియ నాకు ప్రేరణ ఇచ్చింది. నేను దేని గురించి బాధపడలేదు.” అని చెప్పారాయన.జైలు నుంచి విడుదల అవడంతో, కమ్యూనిస్ట్‌ పార్టీ మధురై జిల్లా కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు శంకరయ్య. మధురై జిల్లా పార్టీ చరిత్రలో 1943 నుండి 1947 వరకు (నాలుగు సంవత్సరాలు) చాలా ముఖ్యమైన కాలం. జిల్లా వ్యాప్తంగా జరిగిన సమరశీల ప్రజా పోరాటాలకు పార్టీ నాయకత్వం వహించింది. ఆహార ధాన్యాల నిల్వలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు, అనేక కార్మికవర్గ పోరాటాల అనంతరం కామ్రేడ్‌ పి.రామమూర్తి, ఎ.బాలసుబ్రమణ్యన్‌, ఎం.ఆర్‌.వెంకట్రామన్‌, కె.టి.కె.తంగమణి, జానకి అమ్మ లాంటి యోధులతో పాటు శంకరయ్యను 1946లో అరెస్ట్‌ చేశారు. నాయకులందరినీ మధురై కుట్ర కేసులో ఇరికించారు. వారంతా 1947 ఆగస్ట్‌ 14న ఇతర నాయకులతో పాటుగా విడుదలయ్యారు. వారి విడుదల వార్త ముందుగానే తెలియడంతో, వారిని అభినందించడానికి ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో నాయకులను సాదరంగా ఆహ్వానించారు.జైలు… అండర్‌ గ్రౌండ్‌ జీవితం…కామ్రేడ్‌ శంకరయ్య మొత్తం ఎనిమిదేళ్ల జైలు జీవితం గడిపాడు. వలస పాలనలో నాలుగేళ్లు, స్వాతంత్య్రానంతర కాంగ్రెస్‌ పాలనలో నాలుగేళ్లు కారాగారంలో వున్నారు. అండర్‌ గ్రౌండ్‌లో మూడేళ్ల జీవితం గడిపాడు. అది, ఆయన ఉద్యమానికి అంకితం చేసిన కాలం. స్వాతంత్య్ర సమర యోధులకు ప్రభుత్వం పెన్షన్‌ను ప్రకటించినప్పుడు, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆయన దానిని తిరస్కరించాడు. దాని గురించి ఎవరైనా అడిగితే, దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్ళడమే తనకు గొప్ప బహుమతి అని చెప్పేవాడు.అండర్‌ గ్రౌండ్‌ జీవితం, జైలు జీవితం చాలా కష్టమైనవి, భయంకరమైనవి. ఒక బలమైన, పట్టుదల గల మనస్తత్వం లేకుండా అలాంటి జీవితాన్ని ఎవరూ తట్టుకోలేరు. కమ్యూనిస్టులు ఈ సవాళ్ళను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. శంకరయ్య వేలూరు జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నప్పుడు, ఆయనతోపాటు కమ్యూనిస్ట్‌ ఖైదీలు రాజకీయ వివక్షకు వ్యతిరేకంగా (కాంగ్రెస్‌ ఖైదీలు, కమ్యూనిస్ట్‌ ఖైదీలను ‘ఎ’,’బి’ కేటగిరీలుగా చేయడం) నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. నిరవధిక నిరాహారదీక్ష పదవ రోజున జైలు సూపరింటెండెంట్‌ జైలు సందర్శించినప్పుడు, శంకరయ్య మక్సిమ్‌ గోర్కీ ‘అమ్మ’ నవలను చదువుతుండడం చూశారు. నిరాహార దీక్షలో ఉన్న కమ్యూనిస్టుల మనో ధైర్యాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు.పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా…1953లో ఉమ్మడి కమ్యూనిస్ట్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా శంకరయ్య ఎన్నికయ్యారు. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశం నుండి బయటకు వచ్చిన 32 మంది సభ్యుల్లో శంకరయ్య ఒకరు. వీరే ఆ తర్వాత సిపిఎంను ఏర్పాటు చేశారు. 1995లో సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఆయన 2002 వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో తలెత్తిన సమస్యల పట్ల రాష్ట్ర కార్యదర్శిగా చురుగ్గా స్పందించేవారు.1998లో కోయంబత్తూరులో జరిగిన బాంబు పేలుళ్లు, మత ఘర్షణలు…24 మంది ప్రాణాలు పోవడానికి దారి తీశాయి. ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు శంకరయ్య, కామ్రేడ్‌ ఉమానాథ్‌ను కోయంబత్తూరు పంపించారు. అంతేగాక శంకరయ్య, ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరపడంతోపాటు మత ఘర్షణలకు బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. కార్మికవర్గ కేంద్రంగా ఉన్న కోయంబత్తూరులో జరిగిన మత ఘర్షణల పట్ల సిపిఎం ఆందోళన చెందిందనీ, కార్మికవర్గ ఐక్యతను దెబ్బ తీసే మతతత్వ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.1990 దశాబ్దపు ద్వితీయార్థంలో, తమిళనాడు లోని దక్షిణ జిల్లాలలో జరిగిన కుల ఘర్షణల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. కామ్రేడ్‌ శంకరయ్య అభ్యర్థన మేరకు నాటి ముఖ్యమంత్రి కరుణానిధి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ రెండు రోజుల సమావేశానికి శంకరయ్యతో పాటు నేను కూడా హాజరయ్యాను. సమావేశం జరుగుతున్న సందర్భంలో శంకరయ్య జోక్యం చేసుకొని, ”శ్మశానవాటికలో కన్పించే శాంతిని మా పార్టీ కోరడం లేదు. ఇప్పుడు మేం మీ ముందు వుంచుతున్న అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది” అన్నారు. ఆ అంశాలు: ”అస్పృశ్యతను నిర్మూలించండి. చెలరేగుతున్న కుల ఘర్షణలను అంతం చేయండి. ప్రజల ఐక్యతను కాపాడండి.” కామ్రేడ్‌ శంకరయ్య చేసిన సూచనలను ముఖ్యమంత్రి స్వాగతించారు. వీటి ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో అనేక జిల్లాల్లో అస్పృశ్యత వ్యతిరేక సదస్సులు నిర్వహించారు. శంకరయ్య స్వయంగా ఈ సదస్సులలో పాల్గొని, ఆ సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాడు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడడంలో, శంకరయ్య సూచించిన నినాదాలు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు కీలకమైన పాత్రను పోషించాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.శాసనసభ్యునిగా…తమిళనాడు రాష్ట్ర శాసనసభకు శంకరయ్య మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. మొదటిసారి గెలిచినప్పుడు శాసనసభాపక్ష ఉపనేతగా… రెండు, మూడో దఫా గెలిచినప్పుడు శాసనసభాపక్ష నేతగా పని చేశారు. విద్య, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో తమిళ భాషను ప్రవేశపెట్టాలని నొక్కి చెప్పేవారు. దీంతోపాటు శాసనసభ్యునిగా తాను పోషించిన పాత్ర వలన ఆయనకు మంచి గౌరవం దక్కింది. తమిళనాడులో రైతు ఉద్యమ నిర్మాణంలో శంకరయ్య కీలకమైన పాత్రను పోషించారు. ఆయన తమిళనాడు రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగానూ, అదేవిధంగా జాతీయ స్థాయిలో అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షునిగా, కార్యదర్శిగాను సేవలందించారు. ఉమ్మడి కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రచురించిన జనశక్తి పత్రిక సంపాదకునిగా పనిచేశారు. సిపిఎం ఏర్పడిన తర్వాత తమిళనాడు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నడిచిన ‘తిక్‌ధీర్‌’ పత్రిక సంపాదకునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కళలు, సాహిత్య రంగాల అభివృద్ధికి సంబంధించి కూడా ఆయనకు లోతైన అవగాహన ఉంది. తమిళనాడు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ యూనియన్‌ ఏర్పాటులో ఆయన కీలకమైన పాత్రను పోషించారు. ప్రజాస్వామిక ప్రమాణాలను శంకరయ్య తన వ్యక్తిగత జీవితానికి కూడా విడవకుండా అన్వయిస్తూ వచ్చారు. ఆయన కుల వివక్షతను బలంగా వ్యతిరేకించారు. అంతేగాక తాను పుట్టిన కులమతాలకు చెందని వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆయనది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో చాలా వరకు కులాంతర వివాహాలే జరిగాయి. ఇందులో కామ్రేడ్‌ శంకరయ్య పాత్ర చాలా ముఖ్యమైనది. కామ్రేడ్‌ శంకరయ్య జీవితం నేటి తరం కార్యకర్తలకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

➡️