ప్రజాశక్తి – మేడికొండూరు : మండలంలోని సిరిపురం రోడ్డులోని భవనం స్పిన్నింగ్ మిల్లులో బాల కార్మికుల నియంత్రణ శాఖాధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మిల్లులో 16 మంది బాల కార్మికులను గుర్తించి కంపెనీపై కేసు నమోదు చేశారు. బాలకార్మికులను గుంటూరు చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ శాఖ అధికారులకు అప్పగించారు. ఒరిస్సా నుండి కొంతమందిని తక్కువ కూలి మీద పని చేసేందుకు బ్రోకర్ల ద్వారా ఇక్కడికి తెస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. గతంలో ఇదే తరహాలో బాల కార్మికులను ఈ మిల్లులో గుర్తించారు. అయినా యాజమాన్యం తీరు మారకపోవడం గమనార్హం. తనిఖీల్లో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ ప్రొటక్షన్ టెఎస్ఐలు బేబీరాణి, లక్ష్మి, బీసీలు బాజిమ్మ, గాయత్రి, లేబర్ ఇన్స్పెక్టర్ దేవసేన, ఎఎల్ఒ రెడ్డి, చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ స్వర్ణలత, చైల్డ్ లైన్ సరిత, జిల్లా లీగల్ సొసైటీ పానెల్ నెంబర్ కట్టా కాళిదాసు పాల్గొన్నారు.