ప్రజాశక్తి-భట్టిప్రోలు: ఈ ఏడాది రబీ ఆరంభానికి ముందే మెట్ట ప్రాంత రైతులు సాగుచేసిన మినుము పంటకు పల్లాకు తెగులు సోకింది. భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని లంక గ్రామాలతో పాటు గోరిగపూడి, ఓలేరు, కన్నె గంటివారిపాలెం, పెదపులివరు, వెల్లటూరు గ్రామాలలోని మెట్ట పొలాలలో రైతులు మినుము సాగు చేశారు. ప్రస్తుతం పైరు పూత, పిందే దశలో ఉండగా పల్లాకు తెగులుతో ఆకులు పసుపు రంగులోకి మారి మొక్క మొద్దుబారిపోయి కాయలు కాసే పరిస్థితి లేకుండా పోయింది. దీని వల్ల దిగుబడులు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. గత నాలుగైదేళ్లుగా మినుము, పెసర పంటకు పల్లాగ తెగులు సోకటం లేదని, దీని కారణంగా రైతులు అధిక మొత్తంలో మినుము పంటను సాగు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, పురుగు మందులతో కలిపి ఎకరాకు రూ.10 వేల నుండి రూ.15 వేల వరకు ఖర్చయిందని, పల్లాకు తెగులు కారణంగా దిగుబడులు తగ్గిపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రబీకి కూడా మినుము, పెసర సాగే..ఈ ఏడాది వర్షాభావ కారణంగా నదులలో నీరు లేనందున రబీ సాగుకు అధిక శాతం రైతులు మినుము, పెసర పంటను సాగు చేసేందుకే మక్కువ చూపుతున్నారు. గతంలో సాగుచేసిన మినుము, పెసరకు పల్లాకు తెగులు సోకటంతో రైతులు తీవ్ర నష్టాలకు గురై జొన్న, మొక్కజొన్న పంటల వైపు మొగ్గు చూపారు. ఆ సమయంలో ఎంతో కొంత సాగునీరు కూడా విడుదల కావడంతో రైతులకు కొంత మేర ఊరట లభించింది. కానీ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లోనే అనేక ప్రాంతాలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో రబీకి జొన్న, మొక్కజొన్న పంట వేస్తే నీరు అందే పరిస్థితి లేదు. దీంతో రైతులు మినుము, పెసర పంటను సాగు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం సాగుచేసిన అపరాలకు పల్లాకు తెగులు తగిలి రైతులు నష్టపోతున్నారు. రబీకి సాగు చేయనున్న మినుము, పెసర పంటల పరిస్థితి ఏమిటనే మీమాంసలో రైతులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు తగిన సలహాలు, సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు.అధికారుల పరిశీలనమండలంలోని వివిధ గ్రామాల్లో మెట్ట రైతులు సాగు చేసిన మినుము, పెసర పంటకు పల్లాకు తెగులు సోకడంతో వ్యవసాయ అధికారి మీరయ్య గురువారం పరిశీలించారు. పల్లాకు తెగులు కారణంగా దిగుబడుల్లో వ్యత్యాసం వస్తుందని తెలిపారు. దీని నివారణకు 100గ్రాముల ఇసిటామీ ఫ్రైడ్ లేదా 100గ్రాములు తయోమి టాక్సిన్ వారం నుండి పది రోజుల్లోపు ఈ రెండు మందులు మార్చి మార్చి పిచికారీ చేయాలని సూచించారు. రసం పీల్చు పురుగు ద్వారా ఈ పల్లాకు తెగులు సోకుతుందని తెలిపారు. దీనివల్ల పొలం అంతా వ్యాప్తి చెందుతుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు