ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27, 28. విజయవాడలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని పలువురు నాయకులు పిలుపు ఇచ్చారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ సెంటర్లో బుధవారం సిఐటియు కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఎపి ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.అన్నామణి, కె.పోశమ్మ, ట్రెజరర్ ఎం.వెంకటలక్ష్మి మాట్లాడారు. మోడీ 9 ఏళ్ల పరిపాలనలో 80 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని, దేశవ్యాప్తంగా ప్రజలకిచ్చే పప్పు, ఉప్పు, పెన్షన్ వంటి పథకాలపై కార్పొరేట్ మేధావివర్గం పెద్దఎత్తున దేశభివృద్ధికి నష్టమని ప్రచారం చేస్తూ, మరోపక్క కార్పొరేట్ కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీపై పల్లెత్తు మాట్లాడకుండా దేశప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. దేశంలో ప్రతి 20 నిమిషాలకు వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులు పాలైన రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పారు. రైతాంగం పంటలకు ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి గిట్టుబాటు ధర చట్టం చేస్తేనే రైతాంగాన్ని సంక్షోభం నుంచి కాపాడగలమన్నారు. దేశవ్యాప్తంగా నిత్యావసరాలు ధరలు ఆకాశాన్ని చేరుకుంటుంటే ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. తక్షణం నిత్యవసరాలపై జిఎస్టిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెట్రోలియం ఉత్పత్తులు వంటగ్యాస్పై కేంద్రం విధించిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలన్నారు. కాకినాడ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో పంట సాగుబడి జరుగుతుంటే జగన్ ప్రభుత్వ కొనుగోలు నామమాత్రంగానే ఉందని, దీంతో జిల్లా రైతాంగం తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. తక్షణం మొత్తం పంటని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి మోడీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై తీవ్రమైన భారాలు మోపుతుందని రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్లు పేరుతో యూనిట్ 50 రూపాయలు అమ్ముకునేందుకు కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసిందని విమర్శించారు. ప్రజలను అధిక ధరల నుండి నిరుద్యోగం నుండి రైతాంగ సంక్షోభం నుండి పక్కదారి పట్టించేందుకే బిజెపి పెద్దలు మతోన్మాదాన్ని ప్రాంతీయ తత్వాన్ని కులపరమైన విభజలను తీసుకు వస్తోందన్నారు.