రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఎస్‌పి తనిఖీ

పార్వతీపురం రూరల్‌: వార్షిక తనిఖీల నిమిత్తం స్థానిక రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ సందర్శించారు. ముందుగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. రూరల్‌ సిఐ స్వామినాయుడు, ఎస్‌ఐ సింహాచలం పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లోని ఎస్‌ రైటర్‌, ఎస్‌హెచ్‌ఒ, కంప్యూటర్‌, సిబ్బంది గదులను, కేస్‌ ప్రాపర్టీ భద్రపర్చిన గదులు, స్టేషన్‌ చుట్టుపక్కల పరిసరప్రాంతాలను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న జనరల్‌ డైరీ, డ్యూటీ రోస్టర్‌, విలేజ్‌ రోస్టర్‌, ప్రాపర్టీ రిజిస్టర్‌, కోర్ట్‌కు సంబంధించిన రికార్డులు, ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు, పోలీస్‌ స్టేషన్‌లో సీజ్‌ చేసిన వాహనాలు గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను, కేసుల్లో దర్యాప్తు జరుగుతున్న విధానం, పురోగతి గూర్చి ఆరా తీసి సదరు కేసుల ఛేదింపునకు దోహదపడే దర్యాప్తు విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు.ప్రాధాన్యత కేసులను గుర్తించి స్పీడ్‌ ట్రయల్‌ ద్వారా నిందితులకు శిక్ష పడేలా చూడాలి అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, బ్లాక్‌ స్పాట్‌ల్లో స్టాపర్లను ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు జాగ్రత్తగా ఉండేలా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించి వాహన తనిఖీలు నిర్వహించాలని, ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం జరగకుండా రాకపోకలు జరగాలని ఆదేశాలు జారీచేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్క్‌ (డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఓపెన్‌ డ్రింకింగ్‌) ఎక్కువగా నమోదుచేయాలని, రానున్న ఎలక్షన్‌ దృష్ట్యా గ్రామాలను సందర్శించి ముందస్తు సమాచారం సేకరించాలని సూచనలు ఇచ్చారు. స్టేషన్‌ పరిధిలోని రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించి, వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలిని తెలిపారు. బీట్లు బాగా పెంచి స్టేషన్‌ పరిధిలో జరిగే రెగ్యులర్‌ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి సారించి దొంగతనాలను పూర్తిస్థాయి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒడిశా సరిహద్దు ఉన్నందున నిఘాను ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణా, అమ్మకాలను అరికట్టేలా తగు చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో గ్రీవెన్స్‌ అడిగి తెలుసుకొన్నారు.

➡️