సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సిసి రోడ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రానివ్వొద్దు
– జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
జిల్లాలో శంకుస్థాపన చేసిన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు ఇసుక కొరత రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గనుల శాఖ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్‌ఎస్ హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలలో శంకుస్థాపన చేసిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగులో వున్న పింఛన్ మొత్తాలను తిరిగి జమ చేయాలన్నారు. పింఛన్ మొత్తాన్ని తిరిగి చెల్లించని నెరవాడ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశామన్నారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని సంక్షేమ శాఖ డిడిని కలెక్టర్ ఆదేశించారు. అటవీ ప్రాంత పరిధిలోని 48 చెంచు గూడెంలలో 14 మండలాల సచివాలయ సిబ్బంది బృందాలను పైలెట్ సర్వే నిమిత్తం పంపామని, సంబంధిత సిబ్బందికి స్థానికంగా సహకరించాలని సూచించారు. సచివాలయ సిబ్బందికి పెండింగ్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయడంతో పాటు అర్జిత సెలవులను సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. పని చేయని ఫింగర్ ప్రింట్ డివైజ్‌లను మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ నెల 9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీశైలం పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ కింద గోకులం షెడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు మంగళవారం సాయంత్రంలోగా పంపాలన్నారు. అలాగే పల్లె వనాలు, పశుగ్రాసం, సోక్ పిట్ల నిర్మాణాలకు కూడా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో జెసి సి.విష్ణు చరణ్, డిఆర్‌ఒ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.