చర్ల: సరిహద్దు ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా,పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోగల ధర్మవరం గ్రామానికి చెందిన సబ్కా చంద్రయ్య మంగళవారం ఉదయం చేపలకు వల వేయడానికి వెళుతుండగా పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడి మందు పాతర పేలి తీవ్ర గాయాల పాలైనాడు. గ్రామస్తులు చంద్రయ్య ను జెట్టీలో తీసుకొని వెళుతుండగా 204 కోబ్రా , 151 సిఆర్పిఎఫ్ బెటాలియన్ సిబ్బంది గమనించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తరువాత అతన్ని పామేడు ఫీల్డ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి డాక్టర్ తరుణ్ మాలిక్ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం అతని భద్రాచలం తరలించారు. అక్కడ చంద్రయ్య కుడి కాలును తొలగించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. సకాలంలో స్పందించి గిరిజనుడికి చికిత్స అందించిన సిఆర్పిఎఫ్ చొరవను గిరిజనులు ప్రశంసిస్తున్నారు.