విజయవాడ: రాష్ట్రంలో 440కి పైగా మండలాల్లో కరవు ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కఅష్ణా జలాల పున్ణపంపిణీ గెజిట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకఅష్ణ విజయవాడలో 30గంటల నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు నారాయణతో పాటు మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని విమర్శించారు. అయితే కరవు తీవ్రతను తక్కువగా ఉందనేలా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. నీటి కొరతతో ప్రాజెక్టులు ఎండిపోయాయన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు. కేసుల భయంతో ఆయన ప్రశ్నించడం లేదన్నారు. ప్రజలు భారీ మెజారిటీతో వైసిపిని గెలిపిస్తే ప్రజా సమస్యలు పార్లమెంటులో లేవనెత్తడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. జైలుకు వెళ్లకుండా ఉండేందుకే కేంద్రానికి జగన్ మద్దతు పలుకుతున్నారన్నారు. జగన్ దిల్లీకి వెళ్లేది రాష్ట్ర సమస్యలు పరిష్కారం కోసం కాదని.. కేసులు మాఫీకే కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.