విద్యుత్‌ను ప్రయివేటీకరించొద్దని ధర్నా

Nov 20,2023 21:35 #CITU

ప్రజాశక్తి-విజయవాడ : విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరణ చేసేందుకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజరు కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడ లెనిన్‌ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో అజరు కుమార్‌ మాట్లాడుతూ విద్యుత్‌ ప్రభుత్వ రంగంలోనే ఉండాలన్నారు. ఆదానీకి కారు చౌకగా విద్యుత్‌ రంగాన్ని కట్టపెట్టేందుకే మోడీ ప్రభుత్వం విద్యుత్‌ సవరణ బిల్లు 2020ని తీసుకువచ్చిందని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ పదేళ్ల కాలంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థనైనా ఏర్పాటు చేయలేదని అన్నారు. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి ఈ విద్యుత్‌ బిల్లుని వ్యతిరేకించాలని కోరారు. మోడీ ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలను వెనక్కి తీసుకోపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు బిజెపిని, దానితో అంటకాగే పార్టీలను మట్టి కరిపిస్తారని హెచ్చరించారు. ప్రయివేటీకరణ వల్ల ప్రజలపై తీవ్ర భారాలు పడతాయన్నారు. యూనిట్‌ రూ. పదిపైగా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు ఎన్‌సిహెచ్‌ సుప్రజ, కె దుర్గారావు, కార్యదర్శులు సుధాకర్‌, ఎ కమల, ఇవి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️