- కానిస్టేబుల్ బెదిరింపులతో మనస్తాపం
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : భార్య కాపురానికి రాలేదని పోలీస్‌స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని భర్త నిప్పంటించుకున్న ఘటన తిరుపతి జిల్లాలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి కథనం మేరకు.. విజయవాడకు చెందిన మణికంఠకు తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి చెందిన దుర్గతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. బతుకుదెరువు కోసం వీరు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. మూడు నెలల క్రితం భర్తతో విభేదించిన దుర్గ హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారు. కాపురానికి రావాలని భర్త పదేపదే ప్రాథేయపడిన దుర్గ నిరాకరించారు. ఈ క్రమంలో భాకరాపేటకు చెందిన సోను అలాయాస్ బాషాతో దుర్గాకు పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు సహకారంతో భాకరాపేటలో మకాం పెట్టారు. విషయం తెలుసుకున్న మణికంఠ చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కానిస్టేబుల్‌ను నిలదీశాడు. భార్యను వదిలేసి వెళ్లిపోవాలని… లేకుంటే దొంగతనం కేసుపెట్టి లోపలేస్తానని మణికంఠను కానిస్టేబుల్ బెదిరించాడు. దీంతో, మనస్తాపం చెందిన మణికంఠ తన ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకున్నారు. మంటలతోనే స్టేషన్లోకి వెళ్లి ఆర్తనాదాలు చేశారు. పోలీసులు, స్థానికులు మంటలను ఆర్పారు. తిరుపతి రుయా ఆస్పత్రికి అయనను తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.