కెసిఆర్‌ పాలనకు కాలం చెల్లింది

Nov 20,2023 11:21 #CPM AP, #P Madhu

మాజీ ఎంపి, సిపిఎం ఎపి మాజీ కార్యదర్శి మధు
ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో : 
 కెసిఆర్‌ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని సిపిఎం మాజీ ఎంపి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ కార్యదర్శి పి.మధు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో మునుగోడు సిపిఎం అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి గెలుపు కోసం నిర్వహించిన రోడ్డు షోతో చౌటుప్పల్‌ పట్టణకేంద్రం ఎరుపుమయంగా మారింది. మహిళల కోలాటాలు, కళాకారుల డప్పు చప్పుళ్లు, ఆటపాటలు, వంద మీటర్ల ఎర్రజెండా చేతబూని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళలతో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ రోడ్డు షో చిన్నకొండూరు చౌరస్తా వరకు కొనసాగింది. జిల్లా కార్యదర్శి ఎమ్‌డీ జహంగీర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ బహిరంగసభలో మధు పాల్గొని  మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని, నిజాయితీకి పట్టం కట్టాలని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టుకు బిజెపికి అమ్ముడుపోయారని.. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులే విమర్శించారని గుర్తుచేశారు. రంగులు మార్చే ఊసరవెల్లి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గిట్టుబాటు ధర కోసం రైతు ఉద్యమాలు నిర్వహిస్తే మోడీ రైతులపై లాఠీఛార్జి చేయించారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను బిజెపి కాలరాసిందన్నారు. అలాంటి మోడీ ప్రభుత్వానికి కెసిఆర్‌ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. అవకాశవాద, అవినీతి, మతతత్వ పార్టీల అభ్యర్థులను ఓడించాలన్నారు. ఈ ప్రాంత ప్రజల పక్షాన పోరాటాలు చేసే దోనూరి నర్సిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఎమ్‌డీ జహంగీర్‌, పార్టీ నాయకులు బండ శ్రీశైలం, బూర్గు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️