కెసిఆర్‌ పాలనకు కాలం చెల్లింది

Nov 19,2023 22:15 #cpm

– ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి
– మాజీ ఎంపి, సిపిఎం ఎపి మాజీ కార్యదర్శి మధు
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:కెసిఆర్‌ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని సిపిఎం మాజీ ఎంపి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ కార్యదర్శి పి.మధు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో మునుగోడు సిపిఎం అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి గెలుపు కోసం నిర్వహించిన రోడ్డు షోతో చౌటుప్పల్‌ పట్టణకేంద్రం ఎరుపుమయంగా మారింది. మహిళల కోలాటాలు, కళాకారుల డప్పు చప్పుళ్లు, ఆటపాటలు, వంద మీటర్ల ఎర్రజెండా చేతబూని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళలతో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ రోడ్డు షో చిన్నకొండూరు చౌరస్తా వరకు కొనసాగింది. జిల్లా కార్యదర్శి ఎమ్‌డీ జహంగీర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ బహిరంగసభలో మధు పాల్గని మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్‌ కుటుంబ పాలనకు నవంబర్‌ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలతో కాలం చెల్లిపోతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని, నిజాయితీకి పట్టం కట్టాలని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టుకు బిజెపికి అమ్ముడుపోయారని.. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులే విమర్శించారని గుర్తుచేశారు. బిజెపి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు టికెట్‌ ఇవ్వడం పట్ల ప్రజలు ప్రశ్నించుకుంటున్నారని తెలిపారు. రంగులు మార్చే ఊసరవెల్లి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రజలకు తీరని హామీలు ఇస్తూ మోసం చేస్తున్నాయని, మోడీ ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా చేయలేదని విమర్శించారు. పదేళ్ల మోడీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఐదు లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. గిట్టుబాటు ధర కోసం రైతు ఉద్యమాలు నిర్వహిస్తే మోడీ రైతులపై లాఠీఛార్జి చేయించారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను బిజెపి కాలరాసిందన్నారు. అలాంటి మోడీ ప్రభుత్వానికి కెసిఆర్‌ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. దేశంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు కాలం చెల్లిందన్నారు. ప్రజలు, కార్మికులు, రైతుల కోసం పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. అవకాశవాద, అవినీతి, మతతత్వ పార్టీల అభ్యర్థులను ఓడించాలన్నారు. ఈ ప్రాంత ప్రజల పక్షాన పోరాటాలు చేసే దోనూరి నర్సిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఎమ్‌డీ జహంగీర్‌, పార్టీ నాయకులు బండ శ్రీశైలం, బూర్గు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️