నగముని రచనలు మానవ మనుగడకు స్ఫూర్తి

Nov 19,2023 21:55

– ‘కొయ్యగుర్రం’ మహాకావ్యం ఆవిష్కరణలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌
ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ (గుంటూరు జిల్లా):నగముని రచనలు మానవ మనుగడకు స్ఫూర్తినిస్తాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. నగముని ‘కొయ్యగుర్రం’ ఆధునిక మహాకావ్యం నాలుగో ముద్రణ పుస్తకాన్ని గుంటూరు జిల్లా తెనాలిలోని కవిరాజు పార్క్‌ సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హాల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభకు రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించి మాట్లాడుతూ నగముని రచనలు పాఠకులకు నిగంటువు అని కొనియాడారు. మానవ మనుగడకు స్ఫూర్తినిస్తాయన్నారు. జ్ఞానపీఠ అవార్డును సైతం తిరస్కరించి ప్రజాకవిగా పేరెన్నికగన్నారని గుర్తు చేశారు. నాకు ముఖమే లేనప్పుడు పౌడరు అద్దుతావెందుకు… అనే ఆయన రచనల్లో పదప్రయోక్తులు సహజ జీవితంలో ఆలోచించే విధంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు గుత్తి సుబ్రహ్మణ్యం, అరవింద స్కూల్స్‌ కరస్పాండెంట్‌ సంపూర్ణ, విఎస్‌ఆర్‌ కళాశాల విశ్రాంత అధ్యాపకులు ఎ.రాజేశ్వరిలను సన్మానించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌ అంబటి సురేంద్రరాజు, ఎన్‌ఆర్‌ఐ జిఎస్‌ నాగేశ్వరరావు, ఎన్‌ఆర్‌ తపస్వి, తిరుమలశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గని నగముని సాహిత్యంపై మాట్లాడారు.

➡️