వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం: కేసీఆర్‌

Nov 19,2023 15:00 #KCR

అలంపూర్‌: ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు, గూండాలు గెలవకూడదని బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజల చేతిలో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో నిర్వహించిన బిఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు.
”గతంలో పాలమూరు నుంచి అధికంగా వలసలు ఉండేవి. ప్రస్తుతం అక్కడ వచ్చిన పరిస్థితులను ప్రజలు గుర్తించాలి. ఆర్డీఎస్‌ నుంచి నీళ్లు తరలించుకుని వెళ్తున్నా అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. కాంగ్రెస్‌ నేతలు పదవుల మీద ఆశతో ఏం మాట్లాడలేదు. వాల్మీకి బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్‌ పార్టీయే. మరోసారి బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.
ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అప్పుడు ఆకలి బతుకులు తప్ప ఇంకేం లేవు. కాంగ్రెస్‌ నేతలు చేసిన అన్యాయాలను సరిదిద్దుకొస్తున్నాం. ఆర్డీఎస్‌ కాలువల్లో పూడికతీత పనులకు రూ.13కోట్లు మంజూరు చేశాం. పాలమూరులో కరవు రాకుండా చూసే బాధ్యత నాది. కాంగ్రెస్‌ హయాంలో ఉండే పింఛన్‌ను రూ.2వేలు చేశాం. మరోసారి అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.5వేలకు పెంచుతాం. రైతుబంధు వఅథా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. 24 గంటల కరెంట్‌ వఅథా.. 3 గంటలు చాలు అని రేవంత్‌ అంటున్నారు. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటేయాలి” అని కేసీఆర్‌ అన్నారు.

➡️