ఇది నిజం!!

Nov 19,2023 10:04 #s, #Sneha

బాలల దినోత్సవం రోజునా..
చిన్నారుల హననం
జరుగుతూనే వుంది!
నవ్వులు చిందాల్సిన ముఖాలలో..
పసిమిదేరిన పాదాలలో..
మృత్యువు ఎగురుతూనే ఉంది!
పచ్చి మాంసంలో మురికి
తెగిపడుతున్న మాంసఖండాలే
ఎక్కడ చూసినా..!
పాలుగారే.. పెదవుల నుంచి రక్తం..
ఏరులై పారుతోంది!
అడుగడుగునా.. ఇది నిజం..!
ఆసుపత్రుల్లోనే మృత్యు కౌగిలి
చేరుతున్న నవజాత శిశువులు
యుద్ధోన్మాదానికి బలైన వేలాది చిన్నారులు..
తల్లిదండ్రులు ఎందుకు..
విగతజీవులయ్యారో తెలియక..!
తామెందుకు క్షతగాత్రులయ్యామో అర్థంకాక..!
ప్రాణాలతో పోరాడుతున్న చిన్నారులు!!
ఖచ్చితంగా.. ఇది నిజం!
మతోన్మాదం, జాత్యహంకారం
అనే విష బీజాలు.. బీభత్సంగా..
కరాళ నృత్యం చేస్తున్నాయి!
రాబందుల రెక్కల చప్పుడు
ఉన్మాదుల పద ఘట్టనలు
అశక్తుల మృత్యుకీలల భగభగలు
ప్రపంచానికిదొక గుణపాఠం!!
ఒక్కటి మాత్రం నిజం..!
ఈ చరిత్ర ఇక్కడితో ముగిసిపోదు..
మానవత్వం యొక్క జ్వాల రగిలించడానికి..
అభ్యుదయ శక్తులను కదిలించడానికి..
నిజంగానే ఇదొక హెచ్చరిక!!
సోదరభావపు చిన్నకీలు
పెరుగుతూనే ఉంటుంది!
శాంతి కపోతం తన రెక్కలు విప్పుతూనే వుంటుంది!
ఇది నిజం.. కచ్చితంగా ఇదే నిజం!!

రాజాబాబు కంచర్ల
94900 99231

➡️